Site icon vidhaatha

Prabhakar Rao: ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

విధాత, హైదరాబాద్ :

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు సోమవారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సుదీర్ఘంగా ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ తో నాకు ఏం సంబంధం లేదని..నేను ఆదేశాలిచ్చినట్లుగా ఆధారాలుంటూ చూపండని టీ.ప్రభాకర్ రావు విచారణ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని నేను ఎవరికి ఎక్కడా ఆదేశాలు ఇవ్వలేదన్నారు.నేను ఆదేశించినట్లుగా ఆధారాలుంటూ చూపాలనన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీలో నేను సభ్యుడిని కాదని.. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీ సభ్యులను ఈ కేసులో ఎందుకు ఇన్ వాల్వ్ చేయలేదో చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. నేను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే రిజైన్ చేశానని..ఆ తర్వాత హార్డ్ డిస్క్ లు ధ్వంసమైతే నాకేం సంబంధమని సిట్ అధికారులతో వాదించారు.

సిట్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

ఎస్ఐబీ చీఫ్ గా ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు..కేసు నమోదు కాగానే విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు..ప్రణిత్ రావుతో హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయించారు ఎందుకు?..ఎవరి ఆదేశాలతో వాటిని ధ్వంసం చేయించారు వంటి ప్రశ్నలను సిట్ బృందం సంధించింది. ఎవరి ఆదేశలతో ఫోన్ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఆపరేషన్ బృందాన్ని ఏర్పాటు చేశారు?.. శ్రవణ్ రావుకు ఎస్ఐబీకి ఉన్న సంబంధం ఏంటి? అని సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించింది. సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానం చెప్పడంలో తడబడినట్లుగా సమాచారం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావులను విచారించిన సిట్ వారి నుంచి రాబట్టిన సమాచారం..ఆధారాలతో ప్రభాకర్ రావును విచారిస్తుంది. దీంతో సిట్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలివ్వడంలో ప్రభాకర్ రావు నీళ్లు నమిలారని సమాచారం.

లంచ్ బ్రేక్ తర్వాత ప్రభాకర్ రావు విచారణను తిరిగి కొనసాగించారు. సిట్ అడిగిన ప్రశ్నలకు కోర్టులో వినిపించిన వాదనలనే మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు చెబుతుండటంతో సిట్ అధికారులు కొంత అసహనానికి గురయ్యారు. ఎస్ఐబిలో పని చేసినప్పటికీ నాపైన అధికారులు ఉన్నారని..నాపై అధికారులకు నేను చేసిన ప్రతి పని తెలుసు అని..నేను చేసే ప్రతి పనిపై నిరంతరం వారి పర్యవేక్షణ ఉంటుందని..వారికి తెలియకుండా నేను ఏ పని చేయలేదని ప్రభాకర్ రావు సమాధానాలిచ్చారు. ఎస్ఐబి కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్ డిస్క్లకు సంబంధించి ప్రభాకర్ రావు ఎలాంటి సమాచారం చెప్పలేదని తెలుస్తుంది. ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌ ను సిట్ అధికారులు వీడియో రికార్డ్‌ చేశారు.

Exit mobile version