మూవీ పేరు: ‘రావణాసుర’ విడుదల తేదీ: 07 ఏప్రిల్, 2023 నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత, దక్షా, రావు రమేష్ సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటింగ్: నవీన్ నూలి కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే చాలు.. ఉండే సందడే వేరు. ఎందుకంటే ఆయన ఎనర్జీ […]
మూవీ పేరు: ‘రావణాసుర’
విడుదల తేదీ: 07 ఏప్రిల్, 2023
నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత, దక్షా, రావు రమేష్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటింగ్: నవీన్ నూలి
కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే చాలు.. ఉండే సందడే వేరు. ఎందుకంటే ఆయన ఎనర్జీ అలా ఉంటుంది. అంతకుముందు వరుస ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు కూడా రవితేజ ఎనర్జీలో ఎటువంటి లోపం కనిపించలేదు. ఈ మధ్య ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన తర్వాత ఖాళీగా ఉంటాడా? ఎనర్జీ తగ్గుతుందా? అందుకే రెట్టింపు ఎనర్జీతో వరుసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రవితేజలా సినిమాలు చేసే హీరో ఇండస్ట్రీలో లేరనే చెప్పుకోవాలి.
ఎందుకంటే నాలుగు నెలలకు ఒక సినిమా అన్నట్లుగా రవితేజ తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పరిశ్రమలోని వారికి ఉపాధి కల్పిస్తున్నాడు. హిట్, ఫ్లాప్ సంగతి పక్కన పెడితే.. పరిశ్రమలోని వారికి మాత్రం రవితేజ కారణంగా చేతినిండా పని దొరుకుతుంది. అలా రవితేజ తన ఎనర్జీకి పని కల్పిస్తున్నాడు. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’లో దర్శనమిచ్చిన రవితేజ.. ఇప్పుడు అంటే మూడు నెలల గ్యాప్‌లోనే ‘రావణాసుర’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రచారం, ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ సినిమాపై సూపర్బ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా ఇందులో టైటిల్ ప్రకారం రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనేది సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
రవితేజ కాన్ఫిడెన్స్, దర్శకుడు సుధీర్ వర్మ పనితనం, అక్కినేని హీరో, ఐదారుగురు హీరోయిన్లు.. ఇలా అన్నీ కలగలిపి సినిమాపై భారీగానే అంచనాలు క్రియేట్ చేశాయి. మరి ఆ అంచనాలను ఈ మాస్ రాజా అందుకున్నాడో లేదో మన సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
రవీంద్ర అలియాస్ రవి (రవితేజ).. క్రిమినల్ లాయర్‌గా మంచి పేరున్న కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేస్తుంటాడు. తన తండ్రిపై పడిన హత్యా కేసు నిమిత్తం.. ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో హారిక (మేఘా ఆకాష్).. కనక మహాలక్ష్మిని సంప్రదిస్తుంది. ఆ కేసును వాదించి తన తండ్రిని బయటికి తీసుకురావాలని కోరుతుంది. అతనే హత్య చేసినట్లుగా సాక్ష్యాలు బలంగా ఉండటంతో అందుకు కనక మహాలక్ష్మి ఒప్పుకోదు.
హారికను చూడగానే ఫ్లాట్ అయిన రవి మాత్రం.. ఎలాగైనా ఆమెను ఒప్పిస్తానని హారికకు మాటిస్తాడు. మాట ఇచ్చినట్లే ఆమెను ఒప్పిస్తాడు. అదే సమయంలో సేమ్ టు సేమ్ అలాంటి హత్యలు కొన్ని జరుగుతుంటాయి. ఇందులో సిటీ కమిషనర్ (మురళీ శర్మ), హారికతో పాటు ఇంకొందరు కూడా హత్యకు గురవుతారు. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? ట్రైలర్లో రవితేజ చెప్పేశాడు కాబట్టి.. ఈ హత్యలు అతను ఎందుకు చేస్తున్నాడు? ఈ హత్యల వెనుక దాగున్న అసలు నిజం ఏమిటి? అనేది తెలియాలంటే మాత్రం థియేటర్లలో ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
‘రావణాసుర’ సినిమా పరంగా రవితేజ పాత్రకు ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రవితేజ చేసిన పాత్ర ఛాలెంజింగ్ పాత్ర. ఇలాంటి పాత్ర, ఈ టైమ్‌లో చేయడం అనేది ఆయన చేసిన సాహసంగానే చెప్పుకోవచ్చు. రెండు వేరియేషన్స్ రవితేజ పాత్రలో ఉంటాయి. రెండింటిలోనూ రవితేజ తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అతనిలోని రెండో కోణం రివీల్ అయ్యాక.. చెలరేగిపోయాడని చెప్పుకోవచ్చు. ఫైట్స్, పాటల్లోనూ ఎప్పటిలానే తన ఎనర్జీని చూపించాడు. అక్కినేని హీరో సుశాంత్ ఇందులో సాకేత్ పాత్రలో కనిపించారు. కానీ ఆయన పాత్రకు అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వలేదు.
మరో నటుడు శ్రీరామ్ కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అతని పాత్ర కూడా మాములే. హైపర్ ఆదిని కాసేపు నవ్వించడానికి పెట్టుకున్నట్లున్నారు అంతే. ఇక అను ఇమ్మాన్యుయేల్, ఫరియా, దక్ష, పూజిత, మేఘా ఆకాష్ వంటి ఐదుగురు హీరోయిన్లు నటించినా.. వారి పాత్రలకు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఉన్నంతలో దక్ష పాత్ర పరవాలేదని అనిపిస్తుంది. క్రిమినల్ లాయర్ అయిన ఫరియాను కూడా కొన్ని సరదా సీన్లకు వాడుకున్నారు. ఇంకా రావు రమేష్, మురళీ శర్మ, జయప్రకాశ్, సంపత్ రాజ్ వంటి వారి పాత్రలకు పెద్ద ప్రాధాన్యత లేదు.
ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గా చేసిన జయరామ్ పాత్రకు మాత్రం కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన కూడా హుందాగా ఆ పాత్రలో నటించారు. మిగతా పాత్రలలో పెద్దగా చెప్పుకోవడానికి ఎవరికీ అంత స్కోప్ ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా విలన్ ఈ సినిమాకు మైనస్ అని చెప్పుకోవచ్చు. రవితేజకు ధీటుగా నిలబడే విలన్ లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్‌గా మారింది. మంది ఎక్కువైతే మజ్జిక పల్చన అంటారు కదా.. సినిమాలో ఆర్టిస్ట్‌లు బాగా ఎక్కువైపోయారు.. వారిని దర్శకుడు ఉపయోగించుకోవడంలో అంతగా సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. టెక్నికల్‌గా మాత్రం సినిమా చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, నిర్మాణపు విలువలు హైలెట్ అనేలా సినిమా ఉంది. ‘ధమాకా’ రేంజ్లో మాత్రం పాటలు ప్రభావం చూపేలా లేవు. ఎడిటింగ్ పరంగా.. ఫస్టాఫ్ ఓకే గానీ.. సెకండాఫ్ మరీ సాగదీతగా నడిచింది. శ్రీకాంత్ విస్సా ఇచ్చిన కథ కొత్తగా ఏం లేదు కానీ.. హీరోనే హత్యలు చేయడం అనేదే ఇందులో కొత్త పాయింట్. ప్రతి దానికో ప్లాష్బ్లాక్ అన్నట్లుగా కథ నడిచింది.
డైలాగ్స్ పరంగా మాత్రం శ్రీకాంత్ విస్సా మంచి మార్కులు కొట్టేస్తాడు. సినిమాకు కావాల్సింది ప్రొడక్షన్ డిజైనర్ సమకూర్చారు. ఇక రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాని అనుకున్నంతగా పర్ఫెక్ట్గా దర్శకుడు మలచలేకపోయాడనే అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు వావ్ అనిపించేలా ఉన్నా.. ఎక్కువ శాతం మాత్రం రొటీన్ అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా రవితేజలోని మాస్ అంశాలనే హైలెట్ చేయాలని చూడటంతో.. సుధీర్ వర్మ అన్ని వర్గాల ప్రేక్షకులలోకి ఈ సినిమాని తీసుకెళ్లలేకపోయాడు.
విశ్లేషణ:
ఈ తరహా సినిమాలు ఇంతకు ముందు కూడా చాలా వచ్చాయి. చిన్న హీరోలు ఈ జానర్‌తో మంచి హిట్స్ ఇచ్చారు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత రవితేజకు ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందనే అంతా అనుకున్నారు. కానీ.. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు ఏది బలమో, అదే ఇందులో మిస్సయ్యింది. ఫార్మా మాఫియాపై అల్లుకున్న ఈ కథతో.. తర్వాత ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని కలిగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు తదుపరి సన్నివేశం ఏమిటో ఈజీగా తెలిసిపోతుంది.
అలా అనీ.. సినిమా అంతా అలాగే సాగలేదు. ఇందులో కొన్ని ట్విస్ట్‌లు లేకపోలేదు. కాకపోతే అవి లాజిక్‌లెస్‌గా, సినిమా లిబర్టీకి బాగా దగ్గరగా ఉన్నాయి. హీరో ఏది అనుకుంటే అది జరిగిపోతుందనే లిబర్టీ నుంచి ఇంకా కొందరు దర్శకులు బయటికి రావడం లేదు. టాలీవుడ్ సినిమా రేంజ్‌ను వారు దృష్టిలో పెట్టుకోవడం లేదు. వాస్తవికతకు, నిజ ఘటనలకు కూడా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఆదరణ లభిస్తుందనే విషయం వారు గమనించాలి. ఇంకా మూసధోరణి లోనే సినిమాలు చేస్తామంటే.. వెనుకబడి పోయినట్లే అవుతుంది.
ఇది దర్శకుడు గమినించాలి. అలాగే నాలుగైదు సీన్లతో, రెండు ఉత్కంఠ భరిత సన్నివేశాలతో కూడా సినిమా హిట్ కాదని తెలుసుకోవాలి. రవితేజ నటన, ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సరదా సన్నివేశాలు అలాగే కొన్ని ట్విస్ట్‌లు మినహా ఈ చిత్రంలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మాస్ రాజాలోని మాస్ మాత్రం మిస్సవలేదు. ఓవరాల్‌గా అయితే రవితేజ వీరాభిమానులకు ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది.. ఎందుకంటే మాస్ అంశాలు, ఎలివేషన్స్, పంచ్‌లు పుష్కలంగా ఉన్నాయి.
మొత్తంగా పవర్ ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పవర్ లెస్‌గానే మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే రవితేజ నటించిన గత రెండు సినిమాల ప్రభావంతో పాటు.. అన్ని ఏరియాలలోనూ నార్మల్ ధరకే అమ్మారు కాబట్టి.. నిర్మాతకి ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేకపోలేదు.
ట్యాగ్‌లైన్: రావణాసురుడు కాదు.. రవితేజానే..!
రేటింగ్: 2.5/5