Samajavaragamana Review | ‘సామజవరగమన’.. నవ్వించేందుకే ఈ సినిమా
Samajavaragamana Review | మూవీ పేరు: ‘సామజవరగమన’ విడుదల తేదీ: 29 జూన్, 2023 నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, వెన్నెల కిశోర్, సుదర్శన్, దేవి ప్రసాద్ తదితరులు సంగీతం: గోపీసుందర్ సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి నిర్మాత: రాజేష్ దండ సమర్పణ: అనిల్ సుంకర దర్శకత్వం: రామ్ అబ్బరాజు ఈ మధ్య మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతూ.. ఉన్న పేరుని చెడగొట్టుకుంటున్నాడు కానీ.. అంతకు ముందు హీరో శ్రీవిష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. కచ్చితంగా […]

Samajavaragamana Review |
మూవీ పేరు: ‘సామజవరగమన’
విడుదల తేదీ: 29 జూన్, 2023
నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, వెన్నెల కిశోర్, సుదర్శన్, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
నిర్మాత: రాజేష్ దండ
సమర్పణ: అనిల్ సుంకర
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
ఈ మధ్య మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతూ.. ఉన్న పేరుని చెడగొట్టుకుంటున్నాడు కానీ.. అంతకు ముందు హీరో శ్రీవిష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. కచ్చితంగా అది వైవిధ్యమైన కథే అనే భావన ప్రేక్షకులలో ఉండేది. హిట్ వచ్చినా, రాకపోయినా మాస్ ఇమేజ్ కోసం దండయాత్ర చేస్తూనే ఉంటానని కాకుండా త్వరగానే శ్రీవిష్ణు రియలైజ్ అయ్యాడు. మళ్లీ తన పంథాలో, తనకు బలమైన అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లుగా ‘సామజవరగమన’ చిత్ర టీజర్, ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది.
‘వివాహ భోజనంబు’ సినిమాతో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ని ఇచ్చిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా దాదాపు అలాంటి అటెంప్ట్‌తోనే వచ్చినట్లుగా ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ తెలియజేసింది. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్‌తో.. రిలీజ్‌కు కంటే ముందే చాలా చోట్ల పెయిడ్ ప్రివ్యూస్ ప్రదర్శించారు. శ్రీవిష్ణుకి హిట్ సినిమా పడి చాలా కాలం అవుతుంది. మరి ఈ సినిమా ఆ కొరతని తీర్చిందా? అసలీ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి? రీ రిలీజ్ ట్రెండ్స్ మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా? లేదా? అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఇప్పటి వరకు కొడుకుల్ని తండ్రులు దగ్గరుండి చదివించడం చూశాం.. కానీ ఈ సినిమాలో తన తండ్రి ఉమా మహేశ్వరరావు (నరేష్)ని.. బాలు (శ్రీవిష్ణు) దగ్గరుండి చదివించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన తాత వీలునామా ప్రకారం తన కుమారుడు డిగ్రీ పాస్ అయితేనే కోట్ల రూపాయల ఆస్తి అతనికి చెందుతుందని ఉంటుంది. దానితో తన తండ్రితో డిగ్రీ పాస్ చేయించేందుకు బాలు నానా కష్టాలు పడుతుంటాడు. ఈ ప్రాసెస్‌లో సరయు (రెబా మోనికా జాన్)తో పరిచయం అవుతుంది.
ఆడవాళ్లంటే ఆమడ దూరం జరిగే బాలు.. తనకి ‘ఐ లవ్ యూ’ అనే చెప్పే ఆడవాళ్లతో బలవంతంగా రాఖీ కట్టించుకునే బాలు.. సరయు విషయంలో మాత్రం అతీతంగా ఉంటాడు. ముందు ఆమెతో గొడవ పడినా.. తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. వీరిద్దరి వ్యవహారం పెళ్లి వరకు వెళుతుంది కానీ.. అదేం టైమ్‌లో తన మేనత్త కొడుకు నిశ్చితార్థానికి వెళ్లిన బాలుకి ఓ భయంకర విషయం తెలుస్తుంది.
అదేంటి? ఆ నిశ్చితార్థానికి, తను ప్రేమించిన అమ్మాయికి ఉన్న లింకేంటి? ఆ లింక్‌లన్నింటిని దాటుకుని సరయుని బాలు పెళ్లి చేసుకున్నాడా? బాలు పెళ్లి కోసం ఉమా మహేశ్వరరావు ఏం చేశాడు? అనేది తెలియాలంటే హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్‌లో చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
హీరో శ్రీవిష్ణు.. బాలు పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. అతనిని తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా తన నటనతో ఎంటర్‌టైన్ చేశాడు. అతని పాత్రలో రెండు మూడు రకాల షేడ్స్ ఉంటాయి. ఏషియన్ మల్టీప్లెక్స్‌లో వర్క్ చేసే బాలు.. అక్కడ ఉద్యోగిగా (బాక్సాఫీస్ బాలు), కొడుకుగా, లవర్‌గా ఇలా మంచి నటనకు ఆస్కారమున్న పాత్ర బాలుది. అంతే చక్కగా తన పాత్రని పండించాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఇది కదా శ్రీవిష్ణు అని అంతా అనుకుంటారు.
కొత్తమ్మాయ్ రెబా మోనికాకు కూడా మంచి స్ర్కీన్ స్పేస్ దొరికింది. గ్లామర్‌తోనూ, నటనతోనూ రెబా ఆకట్టుకుంటుంది. సీనియర్ నటుడు నరేష్‌కు మరో మంచి పాత్ర అని చెప్పుకోవాలి. డిగ్రీ పాస్ అవడం కోసం ఆయన పడే పాట్లు.. కడుపుబ్బా నవ్విస్తాయి. ఆయన లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకా ఇతర పాత్రలలో చేసిన శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, సుదర్శన్, రఘుబాబు వంటి వారంతా తమ ప్రతిభను కనబరిచి.. హాయిగా నవ్వుకునేలా చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, దర్శకత్వ ప్రతిభ హైలెట్ అని చెప్పుకోవాలి. సంగీతం పరంగా పాటలు ఏమంత గొప్పగా లేవు కానీ.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ కూడా చక్కగా కుదిరాయి. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తాయి తప్ప.. మిగతా అంతా ఓకే. ఎడిటింగ్ పరంగా కూడా ఓకే. ముఖ్యంగా దర్శకుడు ఈ సినిమాని నడిపించిన తీరు.. ప్రేక్షకులని నవ్విస్తూనే ఉంటుంది. అదే ఈ సినిమాకు బలంగా మారింది.
విశ్లేషణ:
ఈ మధ్య థియేటర్లలోకి వస్తున్న సినిమాలన్నీ కాస్త సీరియస్‌గానే ఉంటున్నాయి. ఆ సీరియస్ మోడ్‌లో నుంచి ఈ సినిమా కాస్త ఉపశమనం కలిగించిందనే చెప్పుకోవాలి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచాడు. స్టార్టింగ్ సీన్ నుంచి.. ఎండింగ్ సీన్ వరకు నవ్వించడం అంటే మాటలు కాదు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. మధ్యమధ్యలో కొన్ని సీన్లు సాగదీతగా అనిపించినా.. కామెడీతో దర్శకుడు కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక చిన్న పాయింట్‌తో సినిమాని ఎలా అల్లుకోవచ్చు అనే దానికి ఉదాహరణ ఈ చిత్రం.
తండ్రిని డిగ్రీ పాస్ చేయించాలని కొడుకు పడే తాపత్రయం, ఆ పరీక్షలు రాయలేక తండ్రి పడే ఇబ్బంది.. ఇవన్నీ నవ్విస్తూనే ఉంటాయి. ఆడవాళ్లకి దూరంగా ఉండే బాలు ఇంట్లోనే పేయింగ్ గెస్ట్‌లా సరయు వచ్చే క్రమం, అసలు ఆడవాళ్లు అంటే తనకు ఎందుకు పడదో.. వారితో రాఖీ ఎందుకు కట్టించుకుంటాడో తెలిపిన విధానం.. ఇవన్నీ అలా సరదాగా సాగుతూ.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడి మైండ్‌కి మంచి రిలాక్స్‌ని ఇస్తాయి.
ఇక ఎప్పుడైతే బావ నిశ్చితార్థానికి బాలు అటెండ్ అవుతాడో.. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది. సరయు సైడ్ నుంచి తన పెళ్లికి వచ్చే ప్రాబ్లమ్, ఆమె తండ్రి సరయుతో బాలుకి రాఖీ కట్టించాలని అనుకోవడం ఇలా.. క్షణం కూడా వదలకుండా సినిమాలో లీనం చేశాడు దర్శకుడు. ఇక వెన్నెల కిశోర్ స్పూఫ్‌తో చేసే కామెడీ, ‘జెర్సీ’ ట్రైన్ సీన్‌ను నరేష్ చేయడం.. ఇలా ఒక్కటేమిటి.. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఏమేం కావాలో.. అవన్నీ ఈ సినిమాలో దర్శకుడు పొందుపరిచాడు.
కొన్ని సాగదీత సీన్లు, కొన్ని లాజిక్ లెస్ సీన్లు మినహా.. సినిమా అంతా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా నడిచింది. టికెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమా ఇస్తుంది. అందులో సందేహం లేదు.. కాకపోతే క్లైమాక్స్ ఏంటనేది ఇలాంటి సినిమాలకు ముందే తెలిసిపోతుంది. ఈ సినిమాకు కూడా ఇంటర్వెల్ తర్వాత కాసేపటికే ఈ సినిమా క్లైమాక్స్ ఏంటనేది తెలిసిపోతుంది.
అలాగే దర్శకుడు కూడా ముగించాడు. కాస్త వెరైటీగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.. కానీ డిజప్పాయింట్ మాత్రం చేయదు. ఓవరాల్‌గా అయితే.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. హాయిగా నవ్వుకోవాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. బాక్సాఫీస్ వద్ద నిలబడే చిత్రమే కానీ.. ప్రేక్షకులు థియేటర్ అంటారో.. లేదంటే ఓటీటీలో వచ్చాక చూద్దామని అనుకుంటారో.. అనే దానిపైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
ట్యాగ్‌లైన్: ‘సామజవరగమన’.. నవ్వించేందుకే ఈ సినిమా
రేటింగ్: 3/5