తప్పుడు ప్రకటనలు చేయకండి.. పతంజలి ఆయుర్వేద్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

యోగా గురు రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద్‌పై తమ ఉత్పత్తుల ఔషధగుణాలపై కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడం, వాటి ఔషధ గుణాలపై ప్రకటనలు చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

  • By: Somu    latest    Feb 27, 2024 11:35 AM IST
తప్పుడు ప్రకటనలు చేయకండి.. పతంజలి ఆయుర్వేద్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
  • కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘనలపై తీవ్ర ఆగ్రహం
  • పంతంజలి ఆయుర్వేద్‌, దాని ఎండీకి షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ : యోగా గురు రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద్‌పై తమ ఉత్పత్తుల ఔషధగుణాలపై కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడం, వాటి ఔషధ గుణాలపై ప్రకటనలు చేయడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఉల్లంఘన ప్రొసీడింగ్స్‌ ఎందుకు చేపట్టరాదో తెలియజేయాలంటూ పతంజలి ఆయర్వేద్‌, దాని మేనేజింగ్‌ డైరెక్టర్‌కు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ ఏ అమానుల్లా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. వారు కోర్టుకు గతంలో వాగ్దానం చేసిన విధంగా ఎలాంటి వైద్య వ్యవస్థపైనా పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేయరాదని పతంజలి ఆయుర్వేద్‌, దాని అధికారులను హెచ్చరించింది.


తమ బ్రాండ్‌ ఉత్పత్తుల ప్రచారంలో ఇకపై ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడబోమని గత ఏడాది నవంబర్‌ 21వ తేదీన కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. పతంజలి ఉత్పత్తులు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని సాధారణ ప్రకటనలు కూడా చేయబోమని, ఎలాంటి వైద్య విధానానికి వ్యతిరేకంగా ఏ మీడియాలోనూ ప్రకటనలు విడుదల చేయబోమని కూడా చెప్పారు. రాందేవ్‌బాబా కో ఫౌండర్‌గా ఉన్న పతంజలి సంస్థ తమ ఉత్పత్తుల్లో ఔషధ గుణాలు ఉన్నాయని కానీ, పలు వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగపడతాయని కానీ తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయరాదని కోర్టు అప్పట్లో ఆదేశించింది. పతంజలి సంస్థ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తున్నది.


ఎంత సాహసం మీకు?


‘కోర్టు ఆదేశించినా ఇటువంటి వాణిజ్య ప్రకటన చేసేందుకు మీకు ఎంత సాహసం? శాశ్వతంగా ఉపశమనం కలిగిస్తారా? శాశ్వత ఉపశమనం అంటే అర్థం ఏమిటి? వ్యాధిని నయం చేస్తారా? మీ ఔషధాలు నిర్దిష్ట వ్యాధులను నయం చేస్తాయని మీరు చెప్పజాలరు’ అని కోర్టు పేర్కొన్నది. రక్తపోటు, మధుమేహం, ఆర్థరైటిస్‌, ఆస్థమా, స్థూలకాయాన్ని పూర్తిగా నయం చేస్తామని పతంజలి కంపెనీ ఎలా చెప్పుకోగలదని నిలదీసింది. ప్రజల దృష్టిలో అల్లోపతిని ఇలా అప్రతిష్ఠపాలు చేయడం తగదు. అల్లోపతి, ఇతర చికిత్సా విధానాలను మీరు విమర్శించజాలరు’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘దేశమంతా ప్రచారం చేస్తున్నారు. మీరు (కేంద్ర ప్రభుత్వం) ఇది నిషేధించినట్టు చట్టం వచ్చే వరకు రెండేళ్లు మీరు ఎదురు చూడండి. కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చొన్నది’ అని వ్యాఖ్యానించింది.