సుప్రీంకోర్టులో బీజేపీకి షాక్
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో దొడ్డిదోవన గద్దెనెక్కాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మేయర్ ఎన్నికల్లో చెల్లిని ఓట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఎనిమిది ఓట్లు చెల్లుతాయని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది

- ఆ ఎనిమిది ఓట్లు చెల్లుతాయి
- రీకౌంటింగ్ నిర్వహణకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో దొడ్డిదోవన గద్దెనెక్కాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మేయర్ ఎన్నికల్లో చెల్లిని ఓట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఎనిమిది ఓట్లు చెల్లుతాయని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వీటిని కలుపుకొని తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని ఆదేశించింది. ఈ ఎనిమిది ఓట్లు ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్‌కుమార్‌కు అనుకూలంగా వచ్చాయి.
జనవరి 30వ తేదీన జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ అలయెన్స్‌ను ఓడించి బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు లభించగా, ఆప్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
అయితే.. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను ట్యాంపర్ చేశారని ఆరోపిస్తూ ఆప్ కోర్టును ఆశ్రయించింది. బ్యాలెట్ పత్రాల్లో మార్పులు చేస్తున్నట్టు కనిపిస్తున్న సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా సుప్రీంకోర్టుకు అందించింది. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.