ముంబైలో జ‌న‌వ‌రి 18 వ‌ర‌కు 144 సెక్ష‌న్‌

ఆర్థిక రాజ‌ధాని ముంబైలో పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు

  • Publish Date - December 21, 2023 / 06:40 AM IST
  • గుంపులుగా తిర‌గ‌డంపై నిషేధం
  • వీవీఐపీలు లక్ష్యంగా ఉగ్రదాడులు
  • ఉండొచ్చ‌ని నిఘావ‌ర్గాల స‌మాచారం
  • ఏరియ‌ల్ యాక్టివిటీస్‌పై నిషేధాజ్ఞ‌లు


విధాత‌: ఆర్థిక రాజ‌ధాని ముంబైలో పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వీవీఐపీల‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర దాడులకు పాల్పడే అవకాశం ఉన్న‌ట్టు నిఘా సంస్థల నుంచి వచ్చిన స‌మాచారం ఆధారంగా ముంబై పోలీసులు ఈ నెల 10 నుంచి వ‌చ్చేనెల‌ 18 వరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 కింద నిరోధక ఉత్తర్వులు విధించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 ప్రకారం శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.


ఉగ్రవాదులు/దేశ వ్యతిరేక శక్తులు డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్, పారా గ్లైడర్లు మొదలైన వాటిని ఉపయోగించే అవకాశం ఉన్నందున ఏరియ‌ల్ యాక్టివిటీస్‌పై కూడా నిషేదాజ్ఞ‌లు ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు. ముంబై పోలీసుల లిఖిత పూర్వక అనుమతితో డ్రోన్లు, రిమోట్-నియంత్రిత మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇత‌ర ఫ్లయింగ్ కార్యకలాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తెలిపారు. వీవీఐపీలు లక్ష్యంగా ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, మహానగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని పోలీసులు వివ‌రించారు. అయితే, 144 సెక్ష‌న్‌ ఆదేశాలు క్రిస్మ‌స్ వేడుకలపై ప్రభావం చూప‌బోవ‌ని బాంబే క్యాథలిక్ సభకు చెందిన డాల్ఫీ డిసౌజా తెలిపారు.