Karnataka: BJP తొలి జాబితాపై భగ్గుమన్న అసంతృప్తి.. పార్టీని వీడిన మాజీ డిప్యూటీ CM
ఇప్పటికే పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలు రెబల్‌గా బరిలో దిగనున్న మాజీ సీఎం షెట్టర్ విధాత: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావడీ పార్టీని వీడారు. బీజేపీ తొలి విడత జాబితాలో తనకు టికెట్ దక్కకపోవడంతో మనస్థాపంతో ఆయన రాజీనామా చేశారు. మరికొంతమంది కీలక నేతలు కూడా టికెట్ల కేటాయింపుల్లో అసంతృప్తిగా ఉండటంతో బీజేపీ అధిష్ఠానం దీర్ఘాలోచనలో పడింది. దూకుడుగా కాంగ్రెస్.. అసమ్మతితో కమలం మే10 జరగనున్న […]

- ఇప్పటికే పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలు
- రెబల్‌గా బరిలో దిగనున్న మాజీ సీఎం షెట్టర్
విధాత: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావడీ పార్టీని వీడారు. బీజేపీ తొలి విడత జాబితాలో తనకు టికెట్ దక్కకపోవడంతో మనస్థాపంతో ఆయన రాజీనామా చేశారు. మరికొంతమంది కీలక నేతలు కూడా టికెట్ల కేటాయింపుల్లో అసంతృప్తిగా ఉండటంతో బీజేపీ అధిష్ఠానం దీర్ఘాలోచనలో పడింది.
దూకుడుగా కాంగ్రెస్.. అసమ్మతితో కమలం
మే10 జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదటి విడతలో 124, రెండో విడతలో 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మూడురోజుల పాటు హస్తినలో కసరత్తు చేసి 189 మందితో మొదటి జాబితా విడుదల చేశారు. ఆ జాబితా పార్టీలో అసమ్మతిని రాజేసింది. మంగళవారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఓ మంత్రి సహా, మరో 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు లభించలేదు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
బెళగావి జిల్లాలోని అథనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్ కుమతల్లికి టికెట్ ఇచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మహేశ్ చేతిలో ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం కుమతల్లి బీజేపీలో ఉన్నారు. తనకు టికెట్ నిరాకరించడంతో లక్ష్మణ్ సావడి బుధవారం పార్టీని వీడారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన రేపో, ఎల్లుండో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది.
ఇప్పటికే బీజేపీ చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పుట్టన్న, చించాన్‌సుర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ చేరికలు కాషాయ పార్టీని కలవరపరుస్తున్నాయి. పార్టీ అగ్రనేత ఈశ్వరప్ప, కరుణాకర్‌రెడ్డి, అరవింద్ నియోజకవర్గాలకు ఇంకా టికెట్లు ప్రకటించాల్సి ఉన్నది.
మాజీ సీఎం షెట్టర్ హైకమాండ్‌పై అసంతృప్తి
అటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ కూడా బీజేపీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధిష్ఠానం తనకు సూచించిందని, పార్టీకి విశ్వాస పాత్రుడిగా ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాలని పార్టీ హైకమాండ్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో షెట్టర్‌కు బీజేపీ అధిష్టానం ఫోన్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హస్తినలో పార్టీ పెద్దలను కలవనున్నారు. పార్టీ అధిష్ఠానం మనసు మారకపోతే ఆయన రెబల్‌గా పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
ఆరుసార్లు గెలిచిన అభ్యర్థికీ దక్కని సీటు
మరోవైపు తొలి విడత జాబితా పట్ల అందరూ సంతోషంగా ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. జాబితా పట్ల అందరిలో ఏకాభిప్రాయం ఉన్నదని వెల్లడించారు. కొంతమంది అసమ్మతి నేతలతో మాట్లాడాల్సి ఉన్నదని అన్న ఆయన వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. బీజేపీ రెండో విడత జాబితా లో మరో 35 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. అందులో 2018 శాసనసభ ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అయితే వారిలోనూ కొంతమందికి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతున్నది.
ఈసారి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ప్రకటించడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో మరో కీలక నేత ఆ పార్టీని వీడారు. దక్షిణ కన్నడ జిల్లా సల్లియా నుంచి మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్. అంగార రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీకి మచ్చరానివ్వకుండా నిజాయితీగా పనిచేసినందుకు తనకు దక్కిన గౌరవం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. సుళయా నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా భాగీరథి మురుళ్యను ఎంపిక చేసింది. దీంతో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొన్నది.