Shivasena | తెలంగాణలో.. పోటీకి శివసేన సన్నాహాలు

Shivasena రాష్ట్ర పార్టీకి హైకమాండ్‌ ఆదేశాలు గెలిచే స్థానాల గుర్తింపుకు కసరత్తు త్వరలో ఏకనాథ్ షిండేతో బహిరంగ సభ విధాత, హైద్రాబాద్: తెలంగాణపై శివసేన హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తమ ఉనికిని చాటాలన్న పట్టుదలతో ఉన్న శివసేన పార్టీ గెలిచే స్థానాల ఎంపికకు కసరత్తు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపి కిషన్‌లను ముంబై కేంద్ర […]

Shivasena | తెలంగాణలో.. పోటీకి శివసేన సన్నాహాలు

Shivasena

  • రాష్ట్ర పార్టీకి హైకమాండ్‌ ఆదేశాలు
  • గెలిచే స్థానాల గుర్తింపుకు కసరత్తు
  • త్వరలో ఏకనాథ్ షిండేతో బహిరంగ సభ

విధాత, హైద్రాబాద్: తెలంగాణపై శివసేన హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తమ ఉనికిని చాటాలన్న పట్టుదలతో ఉన్న శివసేన పార్టీ గెలిచే స్థానాల ఎంపికకు కసరత్తు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపి కిషన్‌లను ముంబై కేంద్ర కార్యాలయానికి పిలిపించిన ఆ పార్టీ సెంట్రల్ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్ వారితో తెలంగాణలో పార్టీ బలోపేతంపై రెండు రోజులుగా మంతనాలు జరిపారు. కాగా తమ భేటీ వివరాలను శివసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ వెల్లడించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ నుంచి బలమైన అభ్యర్ధులను బరిలో దించేందుకు ప్రణాళిక సిద్ధం చెయ్యాలని హైకమాండ్ ఆదేశించిందన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ భౌగోళిక సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాలలో ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధం అవ్వాలని అభిజిత్ అడ్సుల్ సూచించారని తెలిపారు.

శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆహ్వానించామని, హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో ఏక్‌నాథ్ షిండే ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనలు ఆ రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపడం లేదన్నారు. అయితే శివసేన పార్టీ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ సారి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ లక్ష్యాలు పక్కదారి పట్టడంతో 1200 మంది తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయనీ అవన్నీ గాలికి వదిలేసి మహారాష్ట్ర చుట్టు పిచ్చి పెట్టినట్టు తిరగటం ఏ మాత్రం అర్ధం కావడం లేదని అన్నారు.

రహస్య మిత్ర పార్టీలు ఎంఐఎం, బీఆరెస్‌లకు శివసేన సత్తా చూపిస్తామనీ అన్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్న వారికీ శివసేన పార్టీలో చేరాలని పార్టీ పిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపి కిషణ్‌ మరియు మహారాష్ట్ర యువ సేన నాయకుడు సెపూరీ సాయి ఉన్నారు.