Spectrum auction | మే 20 నుంచి టెలికాం స్రెక్ట్రమ్ వేలం.. ప్రాథమిక ధర ఎంతంటే..

Spectrum auction: మొబైల్ ఫోన్ సేవల కోసం నిర్దేశించిన 8 స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలం మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్పెక్ట్రమ్ బ్యాండ్ల ప్రాథమిక ధరను కేంద్ర ప్రభుత్వం రూ.96,317.65 కోట్లుగా నిర్ణయించింది. వేలానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికాం విభాగం (డాట్) తాజాగా నోటీస్ జారీ చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల దగ్గర ఉన్న స్పెక్ట్రమ్‌ను వేలానికి పెట్టనున్నారు.
అదే సమయంలో కొన్ని టెలికాం కంపెనీల దగ్గర ఉన్న స్పెక్ట్రానికి ఈ ఏడాది గడువు తీరనుండడంతో ఆ ఫ్రీక్వెన్సీలనూ ఈ వేలంలో జత చేయనున్నారు. దాంతో ప్రస్తుతం 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్ట్జ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ దరఖాస్తులకు చివరి తేదీని ఏప్రిల్ 22గా నిర్ణయించారు.
తుది బిడ్డర్ల జాబితాను మే 9న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత నమూనా వేలాన్ని మే 13, 14 తేదీల్లో నిర్వహించి, వాస్తవ వేలాన్ని మే 20 నుంచి చేపడతారు. వేలంలో నెగ్గిన బిడ్డర్లకు 20 ఏళ్ల కాలానికి స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. ఇందుకుగాను 20 సమాన వార్షిక వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ రేటును 8.65 శాతంగా నిర్ణయించారు.
కనీసం 10 ఏళ్ల వ్యవధి అనంతరం స్పెక్ట్రమ్‌ను సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి వేలంలో స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు (ఎస్‌యూసీ) లేవు. కాగా, బ్యాంకు హామీలనూ సమర్పించాల్సిన అవసరం లేదు. ఎయిర్‌టెల్, జియ్, వొడాఫోన్ ఇండియా తదితర సంస్థలు ఈ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొననున్నాయి.