TTD: తెలంగాణ భక్తులకు.. టీటీడీ గుడ్ న్యూస్
మార్చి 24 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

TTD : టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 24 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సోమవారం, మంగళవారాల్లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారస్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. అలాగే బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సిఫారసు లేఖలను స్వీకరిస్తారు. ఒక్కో ప్రజాప్రతినిధి లేఖపై 6 మంది భక్తులకు దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలపై ఇప్పటికే మంజూరు చేస్తున్న నాలుగు రోజులతో పాటు మరో రోజు అదనంగా బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఇకపై ఆదివారం కూడా బ్రేక్ దర్శనం మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మేరకు ఫిబ్రవరిలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ గత రెండు నెలలుగా టీటీడీ అధికారులు పరిపాలనాపరమైన ఇబ్బందులు నేపథ్యంలో బ్రేక్ దర్శనం మంజూరు చేసేందుకు అంగీకరించలేదు. తాజాగా టీటీడీ తీరుపై తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అమరావతిలో జరిగిన శ్రీవారి కళ్యాణం నేపథ్యంలో ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి త్వరిగతిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పించాలని ఆదేశించారు. దీంతో ఈనెల 24 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారస్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు.