నేడు వైకుంఠ ఏకాదశి

వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవం పురస్కరించుకుని శనివారం భక్తుల రద్ధీ దృష్ట్యా తిరుమల, యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానాల్లో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది

  • Publish Date - December 22, 2023 / 01:54 PM IST

  • తిరుమల..యాదాద్రిలలో భారీ ఏర్పాట్లు
  • యాదాద్రిలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు

విధాత : వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవం పురస్కరించుకుని శనివారం భక్తుల రద్ధీ దృష్ట్యా తిరుమల, యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానాల్లో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమలలో శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథోత్సవం, ఎల్లుండి 24న ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం మొత్తం 4,23,500 ప్రత్యేక టొకెన్లు పూర్తయ్యే వరకు వాటిని విక్రయిస్తారు. తిరుపతి, తిరుమలలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులకు సంభందించిన టోకెన్లు కోటా త్వరగతినే పూర్తైంది. వైకుంఠ ద్వారా టొకెన్ల కోసం తరలివచ్చిన భక్తుల రద్ధీతో తిరుమల కొండ కిక్కిరిసింది.

ఇటు యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం 6.48గంటలకు శ్రీ స్వామివారి ఉత్తర ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. పాతగుట్టలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. యదాద్రి ప్రధానాలయంలో నేటీ నుంచి 28వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో ఆరు రోజుల పాటు నిత్య సుదర్శన నారసింహ హోమం, నిత్య శాశ్వత కల్యాణాలు, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు, ఏకాదశి సందర్భంగా 23న లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చనలు రద్దు చేసినట్లుగా ఇంచార్జీ ఈవో రామకృష్ణారావు తెలిపారు. అధ్యయనోత్సవాల ఆరు రోజులలో ప్రధానాలయంలో స్వామివారికి ప్రతినిత్యం ఉదయం సాయంకాలం అలంకార సేవలు వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాతగుట్టలో భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం శనివారం ఉదయం 6.42గంటలకు కల్పించనున్నట్లుగా తెలిపారు.

Latest News