Warangal | అధికారంలోకి రాగానే.. బీసీ బంధు అమలు: భట్టి విక్రమార్క
Warangal తెలంగాణ లక్ష్యాలకు TRS అన్యాయం అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బీసీల అభ్యున్నతి కోసం బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చి బీసీ బంధు పథకం తీసుకురావడానికి ఆలోచన చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. భట్టి పాదయాత్ర సందర్భంగా బుధవారం ధర్మసాగర్‌లో జరిగిన మీడియా సమావేశం, సాయంత్రం జరిగిన కార్నర్ మీటింగ్‌లో […]

Warangal
- తెలంగాణ లక్ష్యాలకు TRS అన్యాయం
- అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బీసీల అభ్యున్నతి కోసం బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చి బీసీ బంధు పథకం తీసుకురావడానికి ఆలోచన చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. భట్టి పాదయాత్ర సందర్భంగా బుధవారం ధర్మసాగర్‌లో జరిగిన మీడియా సమావేశం, సాయంత్రం జరిగిన కార్నర్ మీటింగ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు.
భట్టి కామెంట్స్ ఇలా ఉన్నాయి. కేజీ టు పీజీ వరకు నిర్బంధ విద్యను అందిస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తాం. రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల వల్ల తెలంగాణ లక్ష్యాలు నెరవేరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇచ్చిన హామీలు అమలుగాలే
అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని, మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని, వాగ్దానం చేసి తెలంగాణ ప్రజలను దగా చేసిన బిఆర్ఎస్ పరిపాలనలో అల్లాడిపోతున్న ప్రజలకు భరోసా ఇవ్వడానికే పాదయాత్ర చేస్తున్నాను.
అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు నడుం బిగించారు.
సింగరేణి ప్రైవేటీకరణతో ఉద్యోగాలను కొల్లగొట్టడమే కాకుండా రిజర్వేషన్లు తుంగలో తొక్కుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బొగ్గు బావిలో బొంద పెట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారు.
తెచ్చుకున్న రాష్ట్రంలో తీవ్ర అన్యాయం
మన సంపద మనకే, మన కొలువులు మనకే అని కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 9 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వెయ్యకపోగా ప్రశ్న పత్రాన్ని లీకేజీ చేసిన ప్రభుత్వంపై విద్యార్థులు చాలా అక్రోషంగా ఉన్నారని భట్టి చెప్పారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కాకతీయ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా గెలిచేది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గమని భట్టి అన్నారు.
ఈ సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, బండ్రు శోభారాణి, దొమ్మాటి సాంబయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర, డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.