పార్లమెంటులో వాడిన కలర్‌గ్యాస్‌ ఏంటి? ఎందుకు వాడుతారు?

  • By: TAAZ    latest    Dec 13, 2023 11:42 AM IST
పార్లమెంటులో వాడిన కలర్‌గ్యాస్‌ ఏంటి? ఎందుకు వాడుతారు?

న్యూఢిల్లీ : తీవ్ర భద్రతావైఫల్యాన్ని చాటిన లోక్‌సభలో చొరబాటు ఘటనలో నిందితులు వాడిన కలర్‌ గ్యాస్ కానిస్టర్స్‌ గురించి ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఇటువంటి పొగ క్యాన్‌లు, లేదా పొగ బాంబులు కొన్ని దేశాల్లో చట్టబద్ధమే. విజిటర్స్‌ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇటువంటి క్యానిస్టర్‌ నుంచి పసుపు రంగు పొగ వదిలాడు. దీంతో సభ అది దట్టంగా అలుముకున్నది. వెంటనే అప్రమత్తమైన ఎంపీలు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, భద్రతా సిబ్బందికి అప్పగించారు.


అసలీ గ్యాస్‌ కానిస్టర్స్‌ ఏంటి?

చాలా దేశాల్లో స్మోక్‌ క్యాన్స్‌ లేదా స్మోక్‌ బాంబులు చట్టబద్ధమే. రిటైల్‌ మార్కెట్‌లలో అవి విరివిగా లభ్యమవుతాయి. వివిధ అవసరాలను బట్టి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. క్రీడా కార్యక్రమాలు, ఉత్సవాలు, ఫొటోషూట్‌ల సందర్భంగా ఇటువంటిని వాడుతుంటారు. మిలిటరీ విన్యాసాల్లోనూ ఇవి తరచూ కనిపిస్తుంటాయి. క్లిష్ట సమయాల్లో ఇటువంటి దట్టమైన పొగలను సృష్టించడం ద్వారా సైనికులు శత్రువుల కళ్లుగప్పి తప్పించుకుంటుంటారు. గగనతల దాడుల సందర్భంగా టార్గెట్‌ జోన్లను గుర్తించేందుకు, దళాలు కిందికి దిగేందుకు, లేదా ఖాళీ చేసేందుకు ఆయా ప్రాంతాలను గుర్తించేందుకు కూడా వీటిని సైన్యం వినియోగిస్తుంటుంది.


ఫొటోగ్రఫీ.. ఆటల సందర్భంగా..

ఫొటోగ్రఫీ సందర్భంగా కూడా వీటిని వినియోగిస్తుంటారు. తద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎఫెక్ట్‌లు క్రియేట్‌ చేస్తుంటారు. ఫుట్‌బాల్‌, క్రికెట్‌ వంటి అనేక ఆటల్లోనూ ఫ్యాన్స్‌ తమ అభిమాన క్లబ్‌ లేదా దేశాల రంగుల పొగలు వదులుతూ వీటిని ఉపయోగిస్తూ సందడి చేస్తుంటారు.