నాగరికతలో చీకటియుగం లేదా? మోదీ సొంతూరు చెబుతున్న చరిత్ర ఏంటి?
భారతచరిత్రలో చీకటియుగం అనేది లేనే లేదని..5000 సంవత్సరాలుగా వివిధ నాగరితకలు ఒకదాని తర్వాత ఒకటి విలసిల్లుతూ వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు

భారత చరిత్ర (Indian History) లో చీకటి యుగం (Dark Age) అనేది అసలు లేనే లేదని.. గత 5000 సంవత్సరాలుగా వివిధ నాగరితకలు ఒకదాని తర్వాత ఒకటి విలసిల్లుతూ వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. గుజరాత్ (Gujarat) లోని ప్రధాని మోదీ (Modi) స్వగ్రామమైన వాద్‌నగర్‌లో ఇటీవల జరిపిన తవ్వకాలు (Excavations) ఈ వాదనను మరింత బలపరుస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), డెక్కన్ కాలేజ్‌లకు చెందిన పరిశోధకులు ఈ తవ్వకాల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడ ఒక కాలనీ లాంటి నిర్మాణం బయటపడగా.. కార్బన్ డేటింగ్ సాయంతో దాని వయసును లెక్కించారు. ఫలితాల విశ్లేషణ అనంతరం.. ఆ నిర్మాణాలు సామాన్య పూర్వ శకం (బీసీఈ) 800 కాలానికి చెందినవని తేలింది. వేదకాలం తర్వాత, బౌద్ధ మహాజనపదాలు ఏర్పడక ముందు ఇక్కడ నాగరికత విలసిల్లందని పరిశోధకులు భావిస్తున్నారు. సామాన్య పూర్వ శకానికి ముందు 3000 ఏళ్ల కాలంలో.. అంటే ఇప్పటికి 5 వేల ఏళ్ల క్రితం నుంచి ఒక్కో నాగరికత జనించడం, పడిపోవడం.. మరో నాగరికత దాని స్థానంలో ఇలా నిరంతరాయంగా జరుగుతూనే ఉందని.. ఇవేమీ లేని చీకటి యుగం అయితే భారత ఉపఖండంలో లేదని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఒక నాగరికత అంతరించడానికి విదేశీయుల దాడులు, నదులు దారి మార్చుకుని
జనావాసాల పైకి రావడం, పర్యావరణ మార్పులు, కరవులు మొదలైనవి కారణమని తెలిపారు.
వాద్‌నగర్ ప్రత్యేకత ఏమిటి
గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చారిత్రకంగానే కాక సాంస్కృతిక పరంగానూ ఎంతో ప్రాధాన్యముంది. ఇక్కడ హిందూ, బౌద్ధ, ఇస్లాం సంస్కృతులు ఒక దానితో ఒకటి పెనవేసుకుని మనుగడ సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిపిన తవ్వకాల ఆధారంగా ఇక్కడ మౌర్యన్, ఇండో గ్రీక్, ఇండో సిథియన్, షక క్షత్రపా వంటి సామ్రాజ్యాలు విలసిల్లాయని తెలుస్తోంది. తాజాగా జరిపిన తవ్వకాల్లోనూ ఇక్కడ అతి పురాతన బుద్ధ ప్రార్థనా మందిరం ఒకటి బయటపడిందని ఏఎస్ఐ ఆర్కియాలజిస్ట్ డా.అభిజిత్ అంబేడ్కర్ వివరించారు. అంతే కాకుండా కుండలు, ఆభరణాలు, రాగి, బంగారం, వెండి, ఇనుములతో తయారుచేసిన వస్తువులు లభించాయన్నారు. గ్రీకు రాజు అపోల్లోడాటస్ చిత్రంతో ఉన్న నాణాలు దొరకడాన్ని బట్టి ఇండో-గ్రీక్ కాలంలోనే వాద్‌నగర్ ప్రపంచ వాణిజ్య విపణిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత విశిష్టతపై ప్రధాని మోదీ సైతం 2017లో ఒక సారి ప్రస్తావించారు. వాద్‌నగర్ గురించి తాను చైనా పర్యటనలో ఉన్నపుడు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏమన్నారో ఆయన వివరించారు. తను పుట్టిన ఊరైన చైనాలోని గ్జియాన్‌కు మీ జన్మస్థానమైన భారత్‌లోని వాద్‌నగర్‌కు ఒక సంబంధం ఉందని షీ జిన్‌పింగ్ నాతో అన్నారు. చైనాకు చెందిన ప్రపంచ యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ భారత్‌లో పర్యటించినప్పుడు వాద్‌నగర్‌లోనే కొద్దికాలం నివసించారు. అనంతరం చైనా వెళ్లిపోయాక గ్జియాన్ అనే ప్రాంతంలోనే చివరి వరకు ఉన్నారు. జిన్‌పింగ్‌ది కూడా ఆ ఊరే అని మోదీ ఆ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
చీకటి యుగం అంటే…
వివిధ దేశాల్లో ఏ నాగరికతా లేని ఒక కాలాన్ని చీకటి యుగం అని పిలుస్తారు. అలా భారత్‌లో ఇండస్ వ్యాలీ నాగరికత నశించిన తర్వాత ఇనుము యుగం వరకు ఉన్న కాలాన్ని చీకటి యుగం అని వ్యవహరిస్తున్నారు. ఈ చీకటి యుగం తర్వాతే ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో ఉన్న గాంధార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న కోశల్ నగరాలు నిర్మాణమయ్యాయి. ఈ యుగానికి సంబంధించి ఆర్కియాలిజకల్‌గా లభించే ఆధారాలు చాలా తక్కువ. మౌర్య సామ్రాజ్యం (320 – 180 బీసీఈ) చక్రవర్తి అశోకుడు వేయించిన శాసనాలు కొన్ని మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి. గుజరాత్‌లోని గిర్నార్ కొండ వద్ద సుదర్శన సరస్సు వద్ద ఈ శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి చూస్తే ఇప్పటి వరకు తవ్వి తీసిన వాటిల్లో వాద్‌నగర్ అత్యంత పురాతన గ్రామమని తెలుస్తోందని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన అనింద్య సర్కార్ పేర్కొన్నారు. ఇక్కడ బయటపడిన కొన్ని వస్తువులను కార్బన్‌డేటింగ్ చేసి చూడగా కనీసంలో కనీసం1400 బీసీఈ, హరప్పాకు చాలా కాలం తర్వాతి నాటివిగా తేలిందన్నారు. ఒకవేళ ఈ పరిశోధనలు కచ్చితనమైనవని మనం అనుకుంటే గత 5,500 ఏళ్లుగా భారత నాగరికత నిరంతరాయంగా కొనసాగుతోందని భావించాల్సి ఉంటుందన్నారు. తద్వారా చీకటియుగం అనేది భారత్‌లో ఒక మూఢనమ్మకమేనని వ్యాఖ్యానించారు. ఈ తవ్వకాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రఖ్యాత ఎల్సెవర్ జర్నల్ క్వాటెర్నరీ సైన్స్ రివ్యూస్ ప్రచురించింది.