Champai Soren | జార్ఖండ్ పులిగా పేరొందిన చంపై సోరెన్.. ఎవ‌రీయన‌..?

జార్ఖండ్‌లో రాజ‌కీయ హైడ్రామాకు తెర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. హేమంత్ సోరెన్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఎవ‌ర‌నే విష‌యం విదిత‌మే.

  • Publish Date - February 2, 2024 / 05:25 AM IST

Champai Soren | రాంచీ : జార్ఖండ్‌లో రాజ‌కీయ హైడ్రామాకు తెర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. హేమంత్ సోరెన్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఎవ‌రు అధిష్టించ‌బోతున్నార‌నే విష‌యంపై రెండు రోజుల పాటు ఉత్కంఠ కొన‌సాగిన విష‌యం విదిత‌మే. మొత్తానికి అధికార జేఎంఎం కూట‌మి శాస‌న‌స‌భాప‌క్ష నేత చంపై సోరెన్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ ఎట్ట‌కేల‌కు ఆహ్వానించారు. ఇవాళ చంపై సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం 10 రోజుల్లో మెజార్టీ నిరూపించుకోవాల‌ని చంపైకి గ‌వ‌ర్న‌ర్ సూచించారు.


ఎవ‌రీ చంపై సోరెన్..?


చంపై సోరెన్ ప్రముఖ గిరిజ‌న నాయ‌కుడు. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. 67 ఏండ్ల చంపై ప్ర‌స్తుతం జార్ఖండ్ గ‌వ‌ర్న‌మెంట్‌లో ర‌వాణా శాఖ మంత్రిగా కొన‌సాగుతున్నారు. సిరైకేలా – ఖ‌ర్స‌వాన్ జిల్లాలోని జిలిన్‌గోరా గ్రామంలో రైతు కుటుంబంలో జ‌న్మించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నారు. ప్ర‌త్యేక జార్ఖండ్ ఏర్పాటు కోసం జ‌రిగిన ఉద్య‌మంలో చంపై కీల‌క‌పాత్ర పోషించారు. దీంతో ఆయ‌న జార్ఖండ్ పులిగా ప్ర‌సిద్ధి చెందారు. ఇప్ప‌టికీ చంపైని జార్ఖండ్ పులిగా పిలుస్తుంటారు. ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రెసిడెంట్ శిబూ సోరెన్‌కు చంపై అత్యంత స‌న్నిహితుడు. శిబూ సోరెన్‌కు అన్ని వేళ‌లా అండ‌గా నిలిచారు.


1991లో రాజ‌కీయ ప్ర‌వేశం..


1991లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. సిరైకేలా నియోజ‌క‌వ‌ర్గానికి 1991లో ఉప ఎన్నిక‌లు రావ‌డంతో.. ఆ స్థానం నుంచి చంపై స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. నాటి నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. 2005, 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ సిరైకేలా నుంచి గెలుపొందారు. 2009 నుంచి 2014 వ‌ర‌కు సైన్స్ అండ్ టెక్నాల‌జీ, కార్మిక‌, గృహ శాఖ మంత్రిగా కొన‌సాగారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో ర‌వాణా, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్నారు. చంపై సోరెన్‌కు యంగేజ్‌లోనే వివాహ‌మైంది. ఆయ‌న‌కు న‌లుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు సంతానం.

Latest News