Illicit Relationships | పతి పత్ని ఔర్ వో! మంట కలుస్తున్న సంసారాలు.. చివరకు చావులు!
వీటిని నివారించలేమా? కచ్చితంగా నివారించవచ్చు. పెళ్లికి ముందే ఇష్టాయిష్టాలు ఇరువురూ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఇద్దరిలో ఎవరికి ఏ మాత్రం అయిష్టత ఉన్నా.. అక్కడితో ఆగిపోవడం సుఖం. అంతకు మించి ఉభయకుశలోపరి. పెళ్లినాటి మంత్రాలు, చేసుకున్న ఒప్పందాలు గుర్తు చేసుకున్నా.. అడుసు తొక్కేదీ ఉండదు.. కాలు కడిగేదీ ఉండదు!

- శత్రువులవుతున్న భార్యాభర్తలు.. మధ్యలో మూడో వ్యక్తి చొరబాటు
- ప్రియుడితో సుఖ జీవితం కోసం భర్తలను చంపుతున్న భార్యలు
- కొన్ని కేసులలో భార్యలు బలి.. మంటగలుస్తున్న సంసారాలు
- శ్మశానానికి, జైలుకు చెరొకరు.. అనాథలవుతున్న వారి పిల్లలు
- గుబులు రేపుతున్న కొత్త ట్రెండ్
(విధాత స్పెషల్ డెస్క్)
Illicit Relationships | పెళ్లి! ఒక కుటుంబ జీవన వ్యవస్థకు నాంది పలుకుతూ ఏ మతాచారంలోనైనా జరిగే పవిత్ర క్రతువు! ఈ పెళ్లి ఇద్దరు అపరిచితులను జీవితాంతం సుపరిచితులను చేస్తుంది! ధర్మార్ధకామమోక్షాలకు వారి మధ్య ఒక భావోద్వేగ ఒప్పందాన్ని కుదుర్చుతుంది! ఈ పెళ్లి.. రెండు కుటుంబాలను ఒక కుటుంబంగా మార్చుతుంది. ఇదే పెళ్లి.. స్త్రీపురుషుల దాంపత్య జీవితానికి ఆశీర్వచనం పలుకుతుంది.. రెండు వేర్వేరు రక్తబంధాల నుంచి.. ఉమ్మడి బంధాన్ని ఉదయింపజేస్తుంది! ఆ బంధం.. కొడుకులు కూతుళ్లు.. కోడళ్లు అల్లుళ్లు.. మనుమలు మనుమరాళ్లు.. ఇలా.. కొన్ని తరాలు వర్ధిల్లుతుంది! అయితే అందరికీ ఈ ప్రయాణం సుగమం కాకపోవచ్చు. ముళ్లు, రాళ్లు, అవాంతరాలెన్నో ఎదురు కావచ్చు. ఒడిదుడుకులు, అలజడులు తట్టుకుని, అలరింపులు-ఆదరింపులు, సాన్నిహిత్యం-సామరస్యం, సహజీవనం-సమ భావనం ఇవన్నీ కలబోసిన మాధుర్యమే సంసారం. ఇంతటి ప్రత్యేకమైన అనుబంధం ఇప్పుడు మసకబారిపోతుందా? ఇంతటి ప్రత్యేకమైన వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుందా? మనసు, తనువుల కమ్మని కలబోత కర్కశత్వంగా రూపుదాల్చతుందా? ఏమో! ఇప్పుడు చోటు చేసుకుంటున్న దారుణాలను చూస్తుంటే.. కొంత భయం మాత్రం కలుగుతున్నది!
ఇప్పటిదాకా భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య! కట్నం కోసం ఆలిని చంపిన భర్త! తాగిన మైకంలో భార్యను రోకలితో మోదిన భర్త! ఇటువంటి వార్తలు అనేకం చూశాం. అమానుషం! ఒక ప్రాణం తీయడం కంటే దారుణం మరోటి ఉండదు! అదీ.. తన ఇల్లు వదిలి, పరాయి ఇంటిని తన ఇంటిగా మల్చుకునేందుకు సిద్ధపడి వచ్చిన వేరొక ఇంటి యువరాణిని, వేరే ఇంటి కలల పంటను నిర్దయగా చిదిమేయడం ఎంత ఘెరం! సక్రమంగా లేని బంధాలో.. కొత్తగా పుట్టుకొచ్చిన అక్రమ సంబంధాలో ఈ హత్యలకు కారణమవుతూ వచ్చాయి. వస్తూనే ఉన్నాయి కూడా! మాయమైపోతున్న మానవత్వమా? అదృశ్యమవుతున్న మానవ సంబంధాలా? నానాటికీ ఇరుకిరుకుగా మారిపోతున్న ఇరుకు హృదయాలా? ఆధిపత్య భావనలా? తిరుగుబాటులా? పనికిమాలిన చపలచిత్తాలా? ఏవైతేనేం.. ఈ లెక్కలూ అంతూ పొంతూ లేనివే! బయటకు వచ్చినవి కొన్నే! బయటకు రానివి? ఎన్నెన్నో! సందేహం లేదు!!
కానీ.. ఇప్పుడు? సీన్ కొంత రివర్స్ అయినట్టు కనిపిస్తున్నది. ఇప్పుడు కొత్త శీర్షికలతో కొత్త నేరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. భర్తను చంపిన భార్య! ప్రియురాలి కోసం ఆమె భర్తను చంపిన ప్రియుడు! ఇవీ ఇప్పుడు యావత్ కుటుంబ వ్యవస్థలను కలవరపాటుకు గురి చేస్తున్న కొత్త ధోరణలు! పెళ్లయిన కొన్ని రోజులకే మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లినప్పుడు పథకం ప్రకారం చేసిన హత్య ఒక నిదర్శనం! తెలంగాణలోనే ప్రియుడిని పురికొల్పి భర్తే హత్య చేయించిన నవ వధువు ఘటన మరో సాక్ష్యం! తాజాగా మరోటి! ఒకటా రెండా? పెళ్లికి ముందే ఉన్న సంబంధాలతో జరిగే హత్యలు కొన్నయితే.. పెళ్లై ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ అక్రమ సంబంధాలు వెలుగులోకి వచ్చి, లేదా అనుమానించి జరుగుతున్న హత్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి విభాగం నిర్వహించిన అధ్యయనంలో భారతదేశంలో ఏటా సగటున 275 మంది భర్తలను వారి భార్యలు హత్య చేస్తున్నారని, భర్తల చేతిలో 225 మంది భార్యలు హత్యకు గురవుతున్నారని తేలడం నివ్వెరపరుస్తున్నది.
నిజానికి మొగుడు పెళ్లాల కొట్లాట అనేది టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా వంటివి లేని సమయం నుంచీ ఉన్నాయి. అయితే.. ఇప్పటి కాలంలో అవి ఆందోళన కలిగించేంత తీవ్రరూపం తీసుకుంటున్నాయి. తన భర్తనో, భార్యనో, ప్రియురాలినో, ప్రియుడినో కర్కశంగా చంపేంత స్థాయికి వెళ్లిపోతున్నాయి. తెల్లారేసరికి పత్రికల్లో వార్తాంశాలుగా మారుతున్నాయి. ఆ ఘటనలు, హత్యలు జరిగిన తీరు, దాన్ని దాచి పెట్టేందుకు జరిగిన ప్రయత్నాలు, దొరికిపోయిన నేరస్తుల గురించి రాసుకుంటూ పోతే.. అంతూ పొంతూ ఉండదు. ఒకడు తనతో సహజీవనం చేస్తున్న ఒక యువతిని ముక్కలు ముక్కలుగా నరికి.. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఘటనలు చదివాం. భర్త శవాన్ని డ్రమ్ముల్లో, రిఫ్రిజిరేటర్లలో దాచి పెట్టిన ఉందంతాలు చూశాం. భార్యదో, ప్రియురాలితో.. ప్రియుడిదో.. ఎవరిదైతేనేం.. సూట్ కేసులో శవాన్ని పెట్టి రైల్వే స్టేషన్లలోనో, మనుషులు తిరగని ప్రాంతాల్లోనూ పడేసిన వైనాలూ విన్నాం. కరడుగట్టిన నేరగాళ్లే నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దెబ్బకు హడలెత్తి పోతుంటే.. పోలీసులు పనికిమాలినవాళ్లు.. వాళ్ల కన్నుగప్పి నేరం నుంచి సులభంగా తప్పించుకోవచ్చన్న అతి తెలివితో ప్లాన్లు వేస్తుండటం ఒక ఎత్తు! ఇక్కడ సమిధలవుతున్నది అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులే! తండ్రి చనిపోయి.. తల్లి జైలుకు వెళ్లి.. సమాజం ఛీత్కరిస్తుంటే.. ఆ పసి హృదయాలు ఎలా తట్టుకుంటాయన్న ఇంగితజ్ఞానం కూడా కొరవడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. విచిత్రం ఏమిటేంటే.. ఇటువంటి ఉదంతాలు పత్రికల్లో చదివీ.. టీవీల్లో చూసి కూడా ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతూనే ఉన్నారు.
ఐదేళ్లలో 785 మంది భర్తల హత్య
2020 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం ఐదు రాష్ట్రాల్లోనే భార్యల చేతిలో 785 భర్తలు హత్యకు గురయ్యారు. ఇటువంటి దారుణాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రికార్డయినట్టు నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఆ వివరాల ప్రకారం.. 2020 నుంచి 2024 మధ్యకాలంలో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 785 మంది భర్తలు.. తమ భార్యలు లేదా తన భార్య ప్రియుడి చేతిలో లేదా వారు పెట్టుకున్న కిరాయి హంతకుల చేతిలో హత్యలకు గురయ్యారు. రాష్ట్రాలవారీగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో 2020లో 45 మంది భర్తలు హత్యకు గురికాగా, 2024 నాటికి అది 62కు పెరిగింది. బీహార్‌లో 2020లో 30 మంది భర్తలు తమ భార్యల కారణంగా హత్యకు గురైతే 2024లో అవి 42కు పెరిగాయి. 2024లో రాజస్థాన్‌లో 35 మంది, మహారాష్ట్రలో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 22 మంది భర్తలు హత్యలకు గురైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇటీవలి మేఘాలయ హనీమూన్ ఘటన తర్వాత ఒక యువకుడు తాను పెళ్లిచేసుకోబోయే యువతికి వేరే ఇష్టాలు ఉంటే తెలిసినవారెవరైనా తనకు చెప్పి పుణ్యం కట్టుకోవాలని, పెళ్లి తర్వాత ఘోర పరిణామాలకు తాను సిద్ధంగా లేనని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు.. హాస్యాస్పదంగా.. సరదాగా కనిపించినా.. దానిలో ఎంతో నిగూఢ భావన ఉంది.
ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్య
ప్రపంచంలో నేరాలు ఘోరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఐక్య రాజ్య సమితికి చెందిన యూఎన్‌ఓడీసీ లెక్కలు పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నది. రోజువారీ లెక్క చూస్తే.. సగటున 140 మంది మహిళలు లేదా బాలికలు ఇంట్లోనే హత్యలకు గురవుతున్నారు. 2024 నవంబర్ 25 నాటి నివేదిక ప్రకారం.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు/బాలికలు 51,100 మంది హత్యలకు గురయ్యారు. దారుణం ఏమిటేంట.. ఇందులో ఎక్కువ.. సరిగ్గా చెప్పాలంటే.. 60 శాతం మందిని వారి భాగస్వాములో, భర్తలో, లేదా కుటుంబ సభ్యులో చంపేశారు. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. భర్త లేదా సహజీవనానికి సంబంధించిన హత్యలలో 58 శాతం బాధితులు మహిళలు లేదా బాలికలే! మరో 42 మంది భర్తలు బాధితులుగా ఉన్నారు. ఇళ్లలో హత్యకు గురైన మహిళల విషయంలో 60 శాతం వరకూ ప్రస్తుత లేదా మాజీ భాగస్వాముల పాత్ర ఉందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ తెలిపింది. అన్నీ గమనిస్తే.. జీవిత భాగస్వాముల చేతిలో హత్యలకు గురవుతున్న మహిళల శాతం ఆందోళన కలిగిస్తున్నది. భార్యల చేతిలో కూడా భర్తలు హత్యలకు గురవుతున్నా.. అది 6.5 శాతంగా ఉందని నివేదిక పేర్కొన్నది. అయితే.. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. మనిషి కుక్కను కరిస్తే వార్త అనే ధోరణిలో ఉండే మీడియా.. భార్యలు చేసే హత్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ హైలైట్ చేస్తుండటం దాని సహజ లక్షణంగా మారిపోయింది. ఈ పరిశోధనను లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, సౌత్ ఆఫ్రికన్ మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించింది.
భారతదేశంలో ఏటా జరిగే మొత్తం హత్యల్లో ప్రేమ వ్యవహారాల్లో జరిగేవి, అక్రమ సంబంధాల కారణంగా జరిగేవి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే.. ప్రతి పది హత్యల్లో ఒకటి ప్రియుడు, ప్రియురాలు, భర్త, జీవిత భాగస్వామి కారణంగా ఉంటున్నాయి. వీటిని నివారించలేమా? కచ్చితంగా నివారించవచ్చు. పెళ్లికి ముందే ఇష్టాయిష్టాలు ఇరువురూ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఇద్దరిలో ఎవరికి ఏ మాత్రం అయిష్టత ఉన్నా.. అక్కడితో ఆగిపోవడం సుఖం. అంతకు మించి ఉభయకుశలోపరి. పెళ్లినాటి మంత్రాలు, చేసుకున్న ఒప్పందాలు గుర్తు చేసుకున్నా.. అడుసు తొక్కేదీ ఉండదు.. కాలు కడిగేదీ ఉండదు! సర్వే జనా సుఖినో భవంతు!