Meghana Khanna Bindi | ‘బొట్టు బిళ్లల’తో రూ. 20 లక్షల సంపాదన.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేఘన సక్సెస్ స్టోరీ ఇది
Meghana Khanna Bindi | హిందూ సంప్రదాయం( Hindu Custom )లో బొట్టు( Bindi )కు ప్రత్యేక స్థానం ఉంది. కుంకుమను బొట్టుగా పెట్టుకోవడం ఆనాదిగా వస్తుంది. ఈ కుంకుమ స్థానంలో బొట్టు బిళ్లలు( Bottu Billa ) వచ్చేశాయి. కుంకుమకు బదులుగా చాలా మంది విభిన్న రకాలతో కూడిన బొట్టు బిళ్లలను ధరించేవారు. కానీ ఫ్యాషన్ మాయలో పడిపోయిన నేటి మహిళా లోకం.. ఆ బొట్టు బిళ్లలను కూడా పెట్టుకోవడం మానేశారు. ఇలాంటి వారి కోసం ఓ చక్కని పరిష్కారాన్ని వెతికింది హైదరాబాద్( Hyderabad )లో పుట్టి పెరిగిన మేఘన ఖన్నా( Meghana Khanna ).
Meghana Khanna Bindi | ట్రెండీ లుక్ కోరుకునే వాళ్ల కోసం బొట్టు బిళ్లలనే ట్రెండీగా మారిస్తే సరిపోతుంది కదా… అన్న ఆలోచన చేసింది మేఘన ఖన్నా( Meghana Khanna ). ‘బిందీ ప్రాజెక్ట్’ ( The Bindi Project ) పేరిట ఓ సంస్థను స్థాపించి స్టేట్‌మెంట్ తరహా స్టిక్కర్ల తయారీ ప్రారంభించింది. ట్రెండీ బొట్టు బిళ్లల తయారీతో ఏడాదికి రూ. 20 లక్షలు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచింది మేఘన.
డిసెంబర్ 2022లో బెంగళూరులో ప్రారంభమైన “ది బిందీ ప్రాజెక్ట్”, ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు ధరించే బ్రాండ్‌గా ఎదిగింది. కరీనా కపూర్, కాజోల్, సోనమ్ కపూర్, తమన్నా భాటియా వంటి ప్రముఖులు ఈ హ్యాండ్‌క్రాఫ్ట్ బొట్టులను ధరిస్తున్నారు.
మేఘన సక్సెస్.. ఆమె మాటల్లోనే..
మా అమ్మ బెంగాలీ. నాన్న పంజాబీ. దేశం విడిపోయినప్పుడు పంజాబ్‌లోని లాహోర్ నుంచి సికింద్రాబాద్ వచ్చి స్థిరపడింది మా కుటుంబం. మా నాన్న ఇక్కడే పెరిగారు. అయితే నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ కావడం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న చాలా ఏండ్లు సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో ఉన్నారు. నేను ఇక్కడే పుట్టాను. పుణెలో మార్కెటింగ్ & ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశాను.
ఇక ఓ క్వాలిటేటివ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో ఉద్యోగం చేశాను. కానీ అక్కడ ఎక్కువ కాలం పని చేయలేదు. ఉద్యోగంలో చేరిన ఏడాదికే అంటే 2002 జులై 5న మానేశాను. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. నాకు నేను సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. సౌత్ ఇండియాలో బంగారు ఆభరణాలు చాలా సాధారణమైనప్పటికీ.. ముక్కు పోగులు మాత్రం ఎవరూ పెద్దగా తయారు చేయడం లేదని గమనించాను. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్లాను. అక్కడి కళాకారులతో కలిసి లెవిటేట్ అనే హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించాను. అందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. పద్దెనిమిది సంవత్సరాలు దాన్ని నడిపాను. చాలా పేరొచ్చింది. కొవిడ్ సమయంలో అప్పటి పరిస్థితుల కారణంగా దాన్ని మూసివేశాను.
లెవిటేట్ మూసివేశాక.. 2022లో ఒక స్నేహితురాలితో మాట్లాడుతుండగా, అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు గురించి చర్చ జరిగింది. అక్కడే నాకు ఒక ఆలోచన తట్టింది. బొట్టు పెట్టుకోవడం ఒకప్పుడు సంప్రదాయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ బొట్టుబిళ్లల పట్ల ఆసక్తిగా లేరు మహిళలు. దీంతో సాదాసీదాగా, వాడి పడేసి బొట్టు బిళ్లలను కాకుండా.. ఇవి కూడా జ్యువెలరీలా ఒక స్టేట్‌మెంట్‌గా ఎందుకు మారకూడదు? అని ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నలో నుంచి పుట్టిందే ది బిందీ ప్రాజెక్టు.
రూ. 5 లక్షలతో ది బిందీ ప్రాజెక్టు.. రూ. 20 లక్షల టర్నోవర్‌కు
ది బిందీ ప్రాజెక్టు( The Bindi Project )ను రూ. 5 లక్షలతో ప్రారంభించాను. లెవిటేట్( Levitate ) నుంచి మిగిలిన జ్యువెలరీ పీసెస్, డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు మిగిలిన వాటన్నింటితో కలిపి కొత్త బిందీలను తయారు చేయడం ప్రారంభించాను. పాప్ అప్ షోలు, కల్చరల్ ఈవెంట్లకు వెళ్లి ది బిందీ ప్రాజెక్టు గురించి వివరించడం, ట్రెండీ బొట్టు బిళ్లలను పరిచయం చేయడం ప్రారంభించాను. నా వివరణతో బిందీలు కూడా ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అవుతాయా! అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
అలా మహిళా లోకం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మాకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల ద్వారా ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 1500 మందికి పైగా కస్టమర్లకు ట్రెండీ బిందీలను ఆర్డర్ చేశాం. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల ఆదాయం రాగా, గతేడాది ఆ ఆదాయం రెట్టింపు అయింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల టర్నోవర్‌కు చేరింది.
అయితే మా బొట్టు బిళ్లలు చిన్న చుక్కల్లా మాత్రం ఉండవు, 8 మిల్లీమీటర్ల వెడల్పుతో ఇవి ప్రారంభం అవుతాయి. అంటే మన ఆహార్యంలో ఇవి కూడా ఒక నగ లేదా యాక్సెసరీ అనుకోవాలి. వీటితో పాటు ఇచ్చే ప్రత్యేకమైన గమ్‌తో మళ్లీమళ్లీ వాడుకోవచ్చు. ఆమని, రుహాని, దేవయాని, కళ్యాణి… ఇలా రకరకాల పేర్లతో విభిన్నమైన కలెక్షన్లు తీసుకొచ్చాం. ప్యాకెట్ ధర రూ. 1000 నుంచి 5000ల దాకా ఉంటుంది అని మేఘన ఖన్నా చెప్పుకొచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram