Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!

పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!

Pillow Talk | రోజంతా ఉద్యోగం, ఇంటి పనులు, ఆర్థిక ఒత్తిళ్లు, బాధ్యతలతో భార్యాభర్తల జీవితం బిజీబిజీగా గడిచిపోతుంది. ఒకే ఇంట్లో ఉన్న మనస్ఫూర్తిగా మాట్లాడుకునే సమయం కూడా చాలామందికి దొరకదు. దీనివల్ల తెలియకుండానే దంపతుల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజు రాత్రి పడుకునేముందు ఒక్క 10 నిమిషాలు కేటాయించి ప్రేమగా మాట్లాడుకుంటే.. దాంపత్య జీవితం మరింత అన్యోన్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే పిల్లో టాక్ అని కూడా పిలుస్తున్నారు. మరి దంపతుల బంధాన్ని బలోపేతం చేసే ఈ సూపర్ సీక్రెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లో టాక్ అంటే ఏంటి?

పిల్లో టాక్ అంటే భార్యాభర్తలు లేదా ప్రేమికులు పడుకునే ముందు ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం. ఫోన్లు, టీవీలు, సోషల్‌మీడియా వంటి అన్నింటిని పక్కనబెట్టి కేవలం ఒకరిపై ఒకరు దృష్టిపెట్టి మాట్లాడుకోవడంపైనే దృష్టిపెట్టాలి. ఆ రోజంతా జరిగిన విషయాల నుంచి మొదలు చిన్న చిన్న ఆనందాలు, ఆశలు, భయాలు, భవిష్యత్తు వంటి అనేక వాటి గురించి చర్చించవచ్చు. అలా అని ఇది కేవలం మాటలు చెప్పుకోవడానికే కాదు. ఇద్దరు ఒకరినొకరు ఎలాంటి జడ్జ్ చేయకుండా వినడం, భావాలను పంచుకోవడం, ప్రేమను వ్యక్తపరచుకోవడం, భవిష్యత్ గురించి కలలు కనడం వంటి భావోద్వేగ అనుబంధానికి దీన్ని వేదికగా మార్చుకోవచ్చు.

పిల్లో టాక్‌తో కలిగే ప్రయోజనాలు

భావోద్వేగ బంధం బలపడుతుంది

ఈ పిల్లో టాక్ వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగడం కంటే కూడా ఎక్కువగా అవగాహన పెరుగుతుంది. ఒకరినొకరు మరింత అర్థం చేసుకోగలుగుతారు.

గొడవలు తగ్గుతాయి

ముఖ్యంగా దంపతుల మధ్య జరిగే చాలా గొడవలు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే వస్తుంటాయి. అదే రోజూ కొద్దిసేపు మనసువిప్పి మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి.

ఒత్తిడి దూరం

రోజంతా ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో టెన్షన్స్ వస్తుంటాయి. అదే రాత్రి పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు ఆ ఒత్తిడి గురించి జీవిత భాగస్వామితో పంచుకోవడం ద్వారా మనసు తేలికపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది.

రిలేషన్‌పై విశ్వాసం పెరుగుతుంది

తమ భావాలు, కలలు, భయాలు, ఆశలు, ఆశయాలను పంచుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య నమ్మకం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సంబంధం మరింత పారదర్శకంగా మారుతుందని అంటున్నారు. క్రమం తప్పకుండా నాణ్యమైన సంభాషణలు చేసే జంటలు తమ రిలేషన్‌షిప్‌పై ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి.

ఈ విషయాలకు దూరంగా ఉండండి

భార్యాభర్తలకు ఏకాంత సమయం దొరికేది బెడ్‌రూంలోనే. దాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తుంటారు. రాత్రి పడుకునే ముందు మాట్లాడుకోవాలని ఆఫీసులో గొడవలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఆర్థిక కష్టాల గురించి మాట్లాడుతుంటారు. జరిగిపోయిన విషయాలు, పాత గొడవలను గుర్తుచేసుకుని వాటి గురించి చర్చిస్తుంటారు. నువ్వు ఇలా ఉంటావు.. నువ్వు అలా చేశావంటూ విమర్శించుకుంటారు. దీనివల్ల దంపతుల మధ్య బంధం ఏమో కానీ.. దూరం పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఏం మాట్లాడుకోవాలి?

అనవసరపు విషయాలతో సమయాన్ని వృథా చేయకూడదు. ఇద్దరూ అన్యోన్యంగా, ఆప్యాయంగా ఉన్న క్షణాలను గుర్తుచేసుకోవాలి. మొదటి పరిచయం, పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలి. ఆ మధుర క్షణాల గురించి మాట్లాడుకోవాలి. అవసరం ఉన్నా లేకున్నా జీవిత భాగస్వామిని పొగడాలి. నువ్వు దొరకడం నా అదృష్టం.. నీ వల్లే నా జీవితం బాగుంది అని చెప్పే చిన్న మాటలే ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి

రాత్రి పడుకునే ముందు కనీసం 10 నిమిషాల నాటు క్వాలిటీ టైమ్‌ను కేటాయించాలి. ఎందుకంటే భార్యాభర్తలకు దొరికే ఏకాంత సమయం పడక గదిలోనే. కాబట్టి ఆ సమయాన్ని ఫోన్ చేసుకుంటూ వృథా చేసుకోవద్దు. మాట్లాడటంతో పాటు వినడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే అలవాటు చేసుకోవాలి. పొగడ్తలతో సంభాషణలను ముగించాలి అని నిపుణులు చెబుతున్నారు.

Read More:

Cloves | భ‌ర్త‌తో విభేదాలా..? 21 ల‌వంగాలతో ప‌రిష్కారం పొందండి ఇలా..!

Life style | ఆ పని రోజూ చేసే దంపతులకు అనారోగ్యమే దరిచేరదట.. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారట..!

Latest News