Couple Goals | ఉద్యోగ ఒత్తిళ్లు, పిల్లల పెంపకం, ఆర్థిక సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల భార్యభర్తల మధ్య దూరం పెరుగుతోంది. ఒకప్పుడు ఎంతో ఏకాంతంగా గడిపిన జంటలు కూడా ఇప్పుడు ఒకరికొకరు సమయం కేటాయించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల చిన్న చిన్న విషయాలకే గొడవలు, అపార్థాలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా 1-1-1-1 మ్యారేజ్ రూల్‌ను నిపుణులు సూచిస్తున్నారు. ఈ నాలుగు అలవాట్లతో దాంపత్య బంధాన్ని మరింత బలంగా చేసుకోవచ్చని చెబుతున్నారు.
1-1-1-1 రూల్ ఏం చెబుతోంది?
ప్రస్తుతం చాలామంది ఉదయం నుంచి రాత్రి వరకు పనుల్లోనే నిమగ్నమైపోతున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లు, డిజిటల్ ప్రపంచ ప్రభావం, సోషల్‌మీడియా వ్యసనం కారణంగా కుటుంబసభ్యులతో మాట్లాడే సమయం కూడా తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భాగస్వామితో గడిపే నాణ్యమైన సమయం తగ్గి, దూరం పెరిగే ప్రమాదం ఉందని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాంపత్యబంధంలో ప్రేమ, నమ్మకంతో పాటు పరస్పరం అభిరుచుల్ని గౌరవించుకోవడం, ఆలోచనల్ని అర్థం చేసుకోవడం, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం చేయాలి. భార్యాభర్తలు ఇద్దరూ స్నేహితుల్లో కలిసిపోవడానికి తీసుకొచ్చిందే 1-1-1-1 రూల్. ఇందులో భాగంగా నాలుగు అంశాలను భార్యాభర్తలు గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏడాదికి ఒక వారం సెలవు
పెళ్లయిన కొత్తలో చాలామంది భార్యాభర్తలు వీలు దొరికినప్పుడల్లా వెకేషన్లకు వెళ్తుంటారు. కానీ పిల్లలు పుట్టి, బాధ్యతలు పెరిగిన కొద్దీ అలా బయటకు వెళ్లడం కుదరదు. దీంతో దంపతుల మధ్య ఏకాంతం కొరవడుతుంది. అందుకే ఏడాదిలో కనీసం ఒక్క వారమైనా సరే పిల్లలు లేకుండా, ఇతర బాధ్యతలకు దూరంగా కేవలం భార్యాభర్తలు ఇద్దరూ విహారయాత్రకు వెళ్లాలి. దీనివల్ల ఇద్దరూ మానసికంగా రిలాక్స్ అవ్వడమే కాకుండా.. ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే బీచ్, హిల్ స్టేషన్, ఆధ్యాత్మిక యాత్ర ఏదైనా సరే గడిపే సమయం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వారానికి ఒక డేట్ నైట్
ప్రతి వారంలో కనీసం ఒక సాయంత్రం పూర్తిగా భాగస్వామి కోసం కేటాయించాలి. ఆ సమయంలో ఫోన్లు, టీవీలు, సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయడం, సినిమా చూడటం, వాకింగ్‌కు వెళ్లడం, ముచ్చట్లు పెట్టుకోవడం చేయవచ్చు. ఇది దంపతుల మధ్య మానసిక బంధాన్ని బలపరుస్తుంది.
వారానికి ఒక్కసారైనా..
బిజీ లైఫ్ కారణంగా చాలా జంటలు శృంగారానికి తగిన టైమ్ కేటాయించలేకపోతున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఇతర కారణాల వల్ల లైంగిక కోరికలు తగ్గిపోయి శృంగారానికి దూరమవుతున్నారు. అలాగని దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అనుబంధానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కనీసం వారానికి ఒక్కరోజైనా శృంగార జీవితానికి ప్రాధాన్యమిచ్చేలా చూసుకోవాలని అంటున్నారు. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం, పరస్పరం ప్రేమను వ్యక్తం చేయడం, ఆప్యాయతను పంచుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది.
రోజులో అరగంట!
ఈ రోజుల్లో ఎదురుగా ఉన్న మనుషులతో మాట్లాడటం కంటే ఎక్కువగా ఫోన్ చూడటమే అవుతుంది. ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు కూడా ఇదే తంతు. అందుకే ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు మొబైల్, టీవీ వంటి గ్యాడ్జెట్స్‌ను పక్కనబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సమయంలో రోజంతా జరిగిన విషయాలను పంచుకోవాలని, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవాలని, ఒకరి భావాలను మరొకరు వినడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ 1-1-1-1 రూల్ అనేది కచ్చితంగా పాటించాల్సిన నియమమేమీ కాదు. కానీ దాంపత్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, భాగస్వామికి సమయం కేటాయించడం ముఖ్యమైనది. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం నిలకడగా ఉండాలంటే కొంత సమయం వెచ్చించాల్సిందే. మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు దారితీస్తాయని ఈ రూల్ చెబుతోంది.