Relationship After Baby | పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందా.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే సరి!

Relationship after Baby | పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందని చాలామంది చెబుతుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఈ మూడు చిట్కాలు పాటిస్తే మాత్రం బీటలు వారిన బంధాన్ని మళ్లీ దృఢంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Relationship After Baby | పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందా.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే సరి!

Relationship After Baby | పిల్లలు పుట్టిన తర్వాత దాంపత్య జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. కానీ అదే సమయంలో భార్యభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందని చాలామంది చెబుతుంటారు. పిల్లలు పుట్టాక ధ్యాసంతా వారిపైనే పెట్టడంతో భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తుంటారని ఫిర్యాదులు చేస్తుంటారు. ఒక పరిశోధన ప్రకారం.. పిల్లలు పుట్టిన మూడేళ్లలో సుమారు2/3వ వంతు జంటల్లో రిలేషన్ దెబ్బతిని.. వివాదాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లల రాకతో బాధ్యత పెరగడం, వారిని చూసుకోవడానికే సమయం పోవడం, అలసట ఎక్కువ కావడమే ఇందుకు కారణమని అంటున్నారు. అయితే ఇవి సాధారణమేనని.. కొంత అవగాహనతో ముందుకెళ్తే.. ఆ సమస్య నుంచి బయటపడి తమ అనుబంధాన్ని మరింత బలంగా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

పిల్లలు పుట్టాక దంపతుల్లో కనిపించే ప్రధాన మార్పులు

లైఫ్‌స్టైల్‌లో మార్పులు

బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోతుంది. 24 గంటలు ధ్యాస అంతా పిల్లలపైనే ఉంటుంది. తమ పర్సనల్ లైఫ్, తమ కోసం సమయం కేటాయించుకోవడానికి కూడా సమయం ఉండదు.

రిలేషన్‌లో గ్యాప్

పిల్లలను చూసుకోవడంలో పడిపోవడంతో భార్యాభర్తలు సన్నిహితంగా ఉండటానికి, కనీసం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకదు. దీంతో అపార్థాలు పెరుగుతాయి. అవి కాస్త గొడవలకు దారితీస్తాయి.

బాధ్యతలు పెరగడం

పిల్లలు పుట్టాక బాధ్యతలు పెరిగిపోతాయి. దీంతో కొంతమంది ఆర్థికంగా ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో భాగస్వామితో సంతోషంగా ఉండలేరు.

శారీరక, మానసిక ఒత్తిడి

పిల్లలు పుట్టాక తల్లిదండ్రుల్లో నిద్రలేమి ఎక్కువవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లలో ప్రసవానంతరం వచ్చే మార్పులు వారిని చాలా ఒత్తిడిలో పడేస్తుంటాయి.

అయితే ఈ మార్పులు అన్నింటినీ కూడా సహజమేనని భార్యాభర్తలు అర్థం చేసుకోవాలి. వాటన్నింటికీ అడ్జస్ట్ అవుతూ తమ జీవితాన్ని ముందుకు సాగనివ్వాలి.

అన్యోన్య కాపురానికి మూడు చిట్కాలు

1. స్నేహంగా మెలగాలి

పెళ్లికి ముందు గంటలు గంటలు ప్రేమగా మాట్లాడుకుంటుంటారు. కానీ పెళ్లి తర్వాత కాలక్రమేణా అఫెక్షన్ తగ్గిపోతుండటంతో మాటలు తగ్గిపోతుంటాయి. పిల్లలు పుట్టాక అది మరింత దిగజారిపోతుంది. దీనివల్ల భార్యాభర్తల బంధం బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే మళ్లీ పాత రోజులను గుర్తుచేసుకుని, ఒకరి మనసు మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రోజుకు కనీసం 10 నిమిషాలు కేటాయించి మాట్లాడుకోవాలి. పిల్లల అవసరాలు తీరిన తర్వాత లేదా.. వారు పడుకున్నప్పుడు.. లేదా ఆడుకునేటప్పుడు ఏదో ఒక సమయంలో వీలు చేసుకుని కాసేపు మాట్లాడుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవాలి. తద్వారా ఇద్దరి మధ్య ప్రేమ, అర్థంచేసుకునే తత్వం మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

2.పనులు పంచుకోవాలి.. గొడవలు రాకుండా చూసుకోవాలి

పిల్లలు పుట్టిన తర్వాత ఇంటి పనులు పెరుగుతాయి. ఇంటి పనులు చేసుకుని, పిల్లలను చూసుకోవడంలో ఆడవాళ్లు చాలా ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి సమయంలో భర్తలు హెల్ప్ చేయనప్పుడు కాస్త అసహనానికి గురవుతుంటారు. ఒక్కోసారి ఓపిక కోల్పోయి భాగస్వామిపై చికాకు పడుతుంటారు. భర్తలు కూడా తమకు వేరే పనులు ఉన్నాయంటూ భార్యలపైనా అరుస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు రావడం సాధారణమే. అయితే వాటిని ఎలా ఎదుర్కొంటున్నామనేదే చాలా ముఖ్యం. కోపం వచ్చినప్పుడు భావోద్వేగాలను కాసేపు ఆపుకుని, తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. తద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంటి పనులు, పిల్లలను చూసుకోవడంలో ఒకరికి ఒకరు సాయంగా ఉండాలి. దీనివల్ల ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

3.చిన్న మార్పులతో పెద్ద ఫలితం

భార్యాభర్తల అనుబంధం బలపడాలంటే పెద్ద పెద్ద స్టంట్స్ ఏమీ చేయక్కర్లేదు. మన అలవాట్లలో చిన్న మార్పులే బంధాన్ని మరింత బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత బయటకు వెళ్లడానికి కుదరడం లేదని సాకులు వెతుక్కోకుండా.. ఇంట్లోనే క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని సూచిస్తున్నారు. వీలు దొరికినప్పుడు ఇద్దరూ కలిసి సినిమాలు చూడటం, కాసేపు పాటలు వినడం వంటివి కూడా చేయవచ్చు. గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, ఒకరికి నచ్చినట్లు మరొకరు ఉండాలి. దీనివల్ల దంపతుల మధ్య బంధం బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కాకుండా సిక్స్ సెకండ్స్ కిస్ (Six Seconds Kiss) అనే ఆసక్తికరమైన పద్ధతి కూడా ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధానం ప్రకారం భార్యాభర్తలు రోజుకు కనీసం ఆరు సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవాలట. సాధారణ ముద్దు కంటే ఇది కొంచెం ఎక్కువ సమయం ఉండటంతో, ఇద్దరి మధ్య భావోద్వేగ అనుబంధాలు మరింత పెరుగుతాయట. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలవాట్లలో చిన్న చిన్న మార్పులు, రోజులో కొంత సమయం కేటాయిస్తే.. ఇవే దాంపత్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Read More: