Arthi Agarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్ గురించి దర్శకుడు, నటుడు కాశీ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆర్తి అగర్వాల్ వ్యక్తిత్వం, సినీ ప్రయాణం, చివరి రోజులు, అలాగే ఇండస్ట్రీలోని వాస్తవ పరిస్థితుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఇంద్ర’, ‘వసంతం’, ‘నువ్వు లేక నేను లేను’ వంటి వరుస విజయాలతో ఆర్తి అగర్వాల్ అప్పట్లో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఆమె వ్యక్తిత్వం ఎంతో మంచిదని కాశీ విశ్వనాథ్ తెలిపారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆర్తి కెరీర్‌ను ఆమె తండ్రే దగ్గరుండి నడిపించారని చెప్పారు.
నెగెటివిటీ ఉండేది కాదు..
ఆర్తి కెరీర్ ఒక్కసారిగా దిగజారిపోవడానికి పలు కారణాలు ప్రచారంలోకి వచ్చాయని, కొందరు ఇండస్ట్రీలో మిస్‌గైడ్ చేశారని చెబుతుంటే.. మరికొందరు ప్రేమ వైఫల్యమే కారణమని మాట్లాడుకున్నారని ఆయన అన్నారు. అయితే తనకు తెలిసినంత వరకు ఆర్తి చాలా పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తి అని, ఆమెలో ఎలాంటి నెగెటివిటీ ఉండేదే కాదని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆమె మరణంపై వచ్చిన వార్తలను కూడా కాశీ విశ్వనాథ్ ప్రస్తావించారు. ఆర్తి అగర్వాల్ ఆత్మహత్య చేసుకుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. వివాహం తర్వాత ఆమె శరీరాకృతి మారిపోవడంతో తిరిగి సినిమాల్లోకి రావాలనే ఉద్దేశంతో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునే ప్రయత్నంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలిపారు. అదే చివరకు ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని చెప్పారు. ముంబైలో జరిగిన అసలు ఘటనపై బయటకు వచ్చిన కథనాల్లో చాలావరకు ఊహాగానాలే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
డైలాగ్ డెలివరీలో కూడా..
ఇక ‘నువ్వు లేక నేను లేను’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా సమయంలో హీరో తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య చిన్నపాటి అలక ఏర్పడిందని, వారు మాట్లాడుకోని పరిస్థితి వచ్చిందని తెలిపారు. అయితే సినిమా పాట చిత్రీకరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతో తానే వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి, మళ్లీ స్నేహపూర్వక వాతావరణం తీసుకొచ్చానని చెప్పారు.
అంతేకాదు, ఆర్తి అగర్వాల్‌కు తెలుగు భాష సరిగా రాకపోవడంతో ఆ చిత్రానికి సంబంధించిన డైలాగులు నేర్పించడంలో కూడా తాను సహాయం చేశానని వెల్లడించారు. నిర్మాత సురేష్ బాబు సూచనతో ఆమెకు డైలాగ్ డెలివరీలో గైడ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు.