Shivaji Raja | టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ రాజా ఒకప్పుడు వరుస సినిమాలు, టీవీ సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ఆయనకు సంబంధించిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ అభిమానులను కదిలిస్తుంటాయి. తాజాగా ఓ పాత ఇంటర్వ్యూలో శివాజీ రాజా పంచుకున్న అనుభవాలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో శివాజీ రాజా తన జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘అమృతం’ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి తనను కలిసి, తన కుమారుడికి గుండె ఆపరేషన్ చేయించాల్సి ఉందని, అందుకు రూ.35 వేల సహాయం కావాలని వేడుకున్నాడని తెలిపారు. ఆ సమయంలో అతని పరిస్థితి చూసి చలించిపోయిన తాను వెంటనే తన అసిస్టెంట్ ద్వారా ఆ మొత్తాన్ని అందజేశానని చెప్పారు.
కాళ్లపై పడి ఏడ్చాడు..
అయితే డబ్బు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి చాలా రోజుల వరకు కనిపించలేదని, దీంతో కొందరు తనను మోసం చేశాడని కూడా చెప్పారని శివాజీ రాజా వెల్లడించారు. కానీ రెండు మూడు నెలల తర్వాత శంకర్ గౌడ్ తన గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి వచ్చి, తన కాళ్లపై పడి ఏడ్చాడని గుర్తు చేసుకున్నారు.
తన కుమారుడు కోలుకున్నాడని, తమ గ్రామంలో జరిగే జాతరకు తప్పకుండా రావాలని ఆహ్వానించాడని తెలిపారు. ఆ ఆహ్వానం మేరకు గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు తనను ఎంతగానో కదిలించాయని చెప్పారు. ముఖ్యంగా శంకర్ గౌడ్ కుమారుడు తన ఫోటోను దేవుడి ఫోటో పక్కన పెట్టుకుని పూజించడం చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని వెల్లడించారు.
అది ఎప్పటికీ మరిచిపోను…
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్నేళ్ల తర్వాత తనకు యాక్సిడెంట్ జరిగి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన శంకర్ గౌడ్, తన కిడ్నీని దానం చేయడానికి సిద్ధమయ్యాడని శివాజీ రాజా తెలిపారు. తన కోసం 13 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి సహాయం చేయడానికి ముందుకు రావడం జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని సంఘటనగా పేర్కొన్నారు.
ఇక తన కుటుంబ జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి కూడా శివాజీ రాజా మాట్లాడారు. ఒక సమయంలో తన తల్లిదండ్రులు టెలివిజన్ ఇంటర్వ్యూలలో తనపై ఆరోపణలు చేశారని చెప్పారు. మణికొండలో తనకు వంద కోట్ల విలువైన ఆస్తి ఉందని, తాను వారిని సరిగా చూసుకోవడం లేదని ఆరోపించారని వెల్లడించారు.
తప్పుగా అర్ధం చేసుకున్నారు..
అయితే ఈ వివాదం వెనుక ఒక తోటి కళాకారుడు వారిని తప్పుదోవ పట్టించాడని, తప్పుడు సమాచారం ఇచ్చి రెచ్చగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు లేకపోతే తాను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదని, వారిని చూసుకోవడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.ఆ సమయంలో జరిగిన ప్రచారం తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని శివాజీ రాజా పేర్కొన్నారు. అయితే ఆ కష్ట సమయంలో నటుడు పొసాని కృష్ణ మురళి, దివంగత కమెడియన్ వేణుమాధవ్ మాత్రమే తనకు ఫోన్ చేసి మద్దతుగా నిలిచారని చెప్పారు. మిగిలిన వారు మాత్రం తనను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
చివరికి కొంతకాలం తర్వాత తన తల్లిదండ్రులు నిజం తెలుసుకుని తనను అర్థం చేసుకున్నారని చెప్పారు. నిజంగా వంద కోట్ల ఆస్తి ఉంటే నేను ఇంకా టీవీ సీరియల్స్‌లో ఎందుకు నటిస్తాను? అని వారే తర్వాత ప్రశ్నించారని, ఆ అపోహలు తొలగిపోయాయని శివాజీ రాజా వెల్లడించారు.