18th Lok Sabha | ప్రారంభమైన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు
18వ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో ఫ్రమాణం చేయించారు.

ప్రధాని, కేంద్ర మంత్రులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
తొలి రోజు 280మంది ఎంపీల ప్రమాణం
విద్యాశాఖ మంత్రి ప్రమాణానికి నీట్ సెగ
రాజ్యాంగం ప్రతులతో విపక్షం నిరసన
విధాత : 18వ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో ఫ్రమాణం చేయించారు. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్ సభాపక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్ లోక్ సభ సభ్యులుగా ప్రమాణం చేయించారు. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.
తెలుగులో ప్రమాణం చేసిన ఏపీ, తెలంగాణ ఎంపీలు
లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో భాగంగా పలు రాష్ట్రాల ఎంపీలతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ప్రమాణం చేశారు. కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు ‘నీట్.. నీట్.. నీట్..’ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. తొలుత ఎన్డీయే మంత్రివర్గంలోని కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాద్ (చిన్ని), లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. మిగతావారు హిందీ, ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. ఇక కేంద్రమంత్రి రేషన్ రెడ్డి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో తొలిరోజు సభకు హాజరయ్యారు. అప్పలనాయుడు సైకిల్ పై పార్లమెంట్ కు రావడం విశేషం.
రాజ్యాంగం ప్రతులతో విపక్షాల నిరసన
విపక్ష ఇండియా కూటమి నేతలు 18వ లోక్‌సభ తొలి రోజు సమావేశాలకు రాజ్యాంగం పుస్తక కాపీలను చేతుల్లో పట్టుకుని మార్చ్‌గా వచ్చారు. ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు సముదాయంలోని పాత భవనం వద్ద కలుసుకుని, అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వచ్చారు. మొన్నటివరకు మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతంలో రాజ్యాంగం చిరు ప్రతులను చేతపట్టుకుని కొంతసేపు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ దేశ రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దాడికి పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. జవాబు ఇవ్వకుండా ప్రధాని మోదీని ప్రతిపక్షాలు తప్పించుకోనివ్వయని ఆయన అన్నారు.
పార్లమెంట్ ఆవరణలో ఇవాళ రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పై దాడిని ఆమోదించబోమన్నారు. మీరు ఇచ్చే సందేశం ప్రజలకు చేరుతుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. తమ సందేశం ప్రజలకు చేరుతోందని, భారత రాజ్యాంగాన్ని ఏ శక్తి కూడా తాకలేదని, దాన్ని తాము పరిరక్షించనున్నట్లు రాహుల్ తెలిపారు. నిరసన అనంతరం వీరంతా ఒకేసారి లోక్ సభకు వెళ్లారు. సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రాహుల్ విజయం సాధించగా, వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా సమర్పించారు. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుల బలం 99కి పడిపోయింది.