Supreme Court | 23 రోజుల సంసారం.. 22 ఏళ్ల వేధింపు.. ఎట్టకేలకు విడాకులు

ఆమె భర్తతో 23 రోజులు మాత్రమే కాపురం చేసింది. కానీ ఇరవై రెండు సంవత్సరాలు విడాకులు తీసుకోకుండా భర్తను వేధించింది. చివరకు సుప్రీంకోర్టు భర్త పిటిషన్‌ను పరిష్కరిస్తూ వారికి విడాకులు మంజూరు చేసింది.

Supreme Court | 23 రోజుల సంసారం.. 22 ఏళ్ల వేధింపు.. ఎట్టకేలకు విడాకులు

న్యూఢిల్లీ : ఆమె భర్తతో 23 రోజులు మాత్రమే కాపురం చేసింది. కానీ ఇరవై రెండు సంవత్సరాలు విడాకులు తీసుకోకుండా భర్తను వేధించింది. చివరకు సుప్రీంకోర్టు భర్త పిటిషన్‌ను పరిష్కరిస్తూ వారికి విడాకులు మంజూరు చేసింది. భార్యకు ఎటువంటి భరణం మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘ఇరుపక్షాలూ మంచి ఆదాయాలు ఉన్న అర్హులైన వైద్యులు. అందుకే భరణం మంజూరు చేయడం లేదు’ అని న్యాయమూర్తులు తెలిపారు. హస్యాస్పదమైన అంశం ఏమంటే ఆమె విడాకులను వ్యతిరేకిస్తూ చివరిదాకా కొట్లాడింది. తన భర్తతో జీవించాలనుకుంటున్నట్టు, పెళ్లి పవిత్రతను కాపాడుకోవాలనుకుంటున్నట్టు ఆమె కోర్టు వాదించారు. అయితే జరిగిన పరిణామాలన్నీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ పెళ్లికి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ఇంతకాలం నరకయాతన అనుభవించిన ఆ భర్తకు మాత్రం విడాకులే విముక్తి అయింది. ఈ కథనాన్ని జర్నలిస్టు, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌ తన ఎక్స్‌ ఖాతాలో రాశారు.

ఇద్దరు డాక్టర్లు 2002లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మంచి డాక్టర్లు. ఆదాయానికి కొదువ లేదు. కానీ ఆమె నెల రోజుల సంసారం పూర్తి కాకుండానే తల్లిగారింటికి వెళ్లిపోయింది. భార్యను సంసారానికి పంపాలని భర్త కోరారు. కేసు వేశారు. భార్య రాలేదు. భర్త నుంచి భరణం ఇప్పించాలని కేసు వేసింది. కోర్టు అందుకు నిరాకరించింది. భర్త విడాకులు ఇప్పించాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. భార్య తనకు భరణం ఇప్పించాలని కోరడంతోపాటు మొత్తం కుటుంబ సభ్యులపై 498ఎ కేసు పెట్టింది. అత్తమామ ఆడబిడ్డ భర్త అందరినీ అరెస్టు చేశారు. కోర్టు ఆ తర్వాత వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె మళ్లీ కోర్టుకు వెళ్లింది. అక్కడా ఓడిపోయింది. 2006లో కోర్టు భర్తకు విడాకులు మంజూరు చేసింది. ఆమె హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు విడాకుల తీర్పును కొట్టేసింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసి పోలీసులను తీసుకుని ఆయన పనిచేసే చోటుకు వెళ్లింది. రెండు దశాబ్దాలపాటు ఆమె అతడిని ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించింది. భర్త హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు మొత్తం కేసును పరిశీలించి గతవారం భర్తకు విడాకులు మంజూరు చేసింది.