Goa | గోవా జాతరలో ఘోరం.. తొక్కిసలాట జరిగి ఏడుగురు మృతి
Goa | గోవా( Goa )లో ఘోరం జరిగింది. శిర్గావ్( Shirgao )లోని శ్రీ లైరాయ్ దేవి ఆలయం( Shri Lairai Devi Temple ) జాతరలో తొక్కిసలాట జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Goa | పనాజీ : గోవా( Goa )లో ఘోరం జరిగింది. శిర్గావ్( Shirgao )లోని శ్రీ లైరాయ్ దేవి ఆలయం(Shri Lairai Devi Temple ) జాతరలో తొక్కిసలాట జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను నార్త్ గోవా జిల్లాలోని గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులు చికిత్స పొందుతున్న గోవా మెడికల్ కాలేజీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెళ్లారు. బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
శిర్గావ్‌లోని లైరాయ్ దేవి ఆలయంలో ప్రతి ఏడాది జాతర నిర్వహిస్తారు. ఈ జాతర శుక్రవారం ప్రారంభమైంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని గోవా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇక అమ్మవారి ఆశీస్సుల కోసం మండుతున్న నిప్పుల పైనుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు భక్తులు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.