Samvidhan Hatya Divas | ఎమర్జెన్సీ ప్రకటన రోజుపై కేంద్రం కీలక నిర్ణయం

1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్‌ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు

Samvidhan Hatya Divas | ఎమర్జెన్సీ ప్రకటన రోజుపై కేంద్రం కీలక నిర్ణయం

ఏటా సంవిధాన్ హత్యా దీవస్‌గా జరుపుకోవాలని కేంద్రం ప్రకటన

విధాత, హైదరాబాద్ : 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్‌ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు. జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం పట్ల ప్రేమ ఒలకబోస్తోందని పలు సందర్భాల్లో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శల దాడి సాగిస్తున్నారు. రాజ్యాంగానికి పలుమార్లు సవరణలు తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని, అలాంటి పార్టీ మాపై రాజ్యాంగాన్ని మార్చేస్తామని అసత్యాలు ప్రచారం చేస్తోందని గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ ప్రతులతో హడావిడి చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

జూన్‌ 25ను రాజ్యాంగ హత్య దినంగా పాటించాలన్న కేంద్రం నిర్ణయానికి కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. జూన్‌ 4ను ‘మోదీ ముక్తి దివస్‌’గా పాటించాలని, ఆ రోజు మోదీ నైతిక ఓటమికి గురయ్యారని పేర్కొన్నది. జూన్‌ 4, 2024న వెలువడి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమై, సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సాధారణ మెజార్టీకి దూరంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్డీయే మిత్రపక్షాల సహకారంతో మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం మోదీ నైతిక ఓటమిగా ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ చర్య పత్రికల్లో ప్రధాన శీర్షికలను ఆకర్షించే తతంగమేనని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. ‘దేశంలో పదేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్న నాన్‌ బయొలాజికల్‌ ప్రధాని జూన్‌ 4, 2024 తర్వాత దేశ ప్రజలు నిర్ణయాత్మక, రాజకీయ, నైతిక ఓటమిని అందించిన తర్వాత మరోసారి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో నిలిచేందుకు నయవంచనతో చేసిన ప్రయత్నమే ఇది. జూన్‌ 4, 2024 మోదీ ముక్తి దివస్‌గా చరిత్రలో నిలిచిపోయే’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం, దాని విలువలు, ప్రజాస్వామిక సంస్థలపై ఇదే నాన్‌ బయొలాజికల్‌ ప్రధాని పద్ధతి ప్రకారం దాడి చేశారు. మనుస్మృతి నుంచి స్ఫూర్తి పొందలేదన్న ప్రాతిపదికన 1949 నవంబర్‌లో రాజ్యాంగాన్ని ఇదే నాన్‌ బయొలాజికల్‌ ప్రధానికి చెందిన సైద్ధాంతిక పరివారం తిరస్కరించింది. ఈ నాన్‌ బయొలాజికల్‌ ప్రధానికి డెమోక్రసీ అంటే.. డెమో కుర్సీ మాత్రమే’ అని ఆయన పేర్కొన్నారు.