Beer Price | ఈ సమ్మర్‌లో చల్లగా బీర్ తాగి చిల్ అవ్వాలని అనుకుంటున్న మందుబాబులకు షాకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్‌తో పాటు బీర్ల తయారీపై కూడా పడింది. దీంతో ఈ వేసవిలో బీర్ల ధరలు భారీగా పెరగనున్నాయని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) తెలిపింది. లేదంటే సరఫరాలో కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. యుద్ధం ప్రభావంతో ముడి పదార్థాల ఖర్చులు పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థ దెబ్బతినడమే ఇందుకు కారణమని వివరించింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గత మూడు వారాల్లో కీలక ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయని BAI వెల్లడించింది. గ్లాస్ బాటిళ్ల ధరలు సుమారు 20 శాతం పెరిగాయని, కార్టన్ బాక్సుల ధరలు దాదాపు రెండింతలు అయ్యాయని పేర్కొంది. LDPE, BOPP, అడ్హీసివ్ ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయని తెలిపింది. ఇక రవాణా ఖర్చులు 10 శాతం పెరిగాయని చెప్పింది. వీటికి తోడు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే సుమారు మూడు శాతం పడిపోయింది. ఫలితంగా మొత్తం ఉత్పత్తి ఖర్చులు 12-15 శాతం పెరిగినట్లు BAI వెల్లడించింది.
యుద్ధం కారణంగా అల్యూమినియం సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో బీర్ క్యాన్ తయారీ కూడా ప్రభావితమవుతోంది. అలాగే కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల గ్లాస్ బాటిల్ తయారీ యూనిట్లు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలే వేసవి కాలంలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుందని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి ఆగిపోతే.. సరఫరా తగ్గి మార్కెట్‌లో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని బ్రూవర్స్ అసోసియేషన్ తెలిపింది. అందుకే బీర్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించాలని కోరింది.
ధరలు పెంచడానికి అనుమతి ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాలకే బీర్ల సరఫరా చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని బ్రూవర్స్ అసోసియేషన్ తెలిపింది. ధరలు పెంచడానికి అనుమతి లేని రాష్ట్రాల్లో సరఫరా నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ధరల నియంత్రణ కొనసాగితే బ్రూవర్స్ పరిశ్రమకు తీవ్ర నష్టం కలుగుతుందని బీఏఐ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి తెలిపారు. ఖర్చులు పెరుగుతున్న సమయంలో ధరలను పెంచకుండా ఉంచడం సరైనది కాదని పేర్కొన్నారు. సరఫరా కొనసాగాలంటే ప్రభుత్వాలు అనువైన విధానాలు తీసుకోవాలని కోరారు.
బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో యునైటెడ్ బ్రూవరీస్, AB ఇన్‌బెవ్, కార్ల్స్‌బర్గ్ వంటి ప్రముఖ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. భారత్‌లో విక్రయించే బీర్లలో దాదాపు 85 శాతం ఈ సంస్థలే ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం.
