JDU Releases First List of 57 Candidates | బీహార్ ఎన్నికలు..57మందితో జేడీయూ తొలి జాబితా

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేడీయూ 57 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఎల్జేపీ (రామ్ విలాస్)కి కేటాయించిన నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చిరాగ్ పాస్వాన్‌కు జేడీయూ షాకిచ్చింది. ఎన్డీఏలో సీట్ల వివాదం మొదలైంది.

bihar-elections-2025-jdus-first-list-of-57-candidates-names

న్యూఢిల్లీ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి జేడీ(యూ) తన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. 57స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అయితే సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ తమ మిత్ర పక్షం లోక్ జన్ శక్తికి కేటాయించిన నాలుగు సీట్లలో అభ్యర్థులను ప్రకటించి చిరాగ్ పాశ్వాన్ కు షాక్ ఇచ్చారు. ఈ పరిణామం ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టేదిగా మారింది. ఎల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ పేర్కొన్న నాలుగు స్థానాలు సోన్‌బర్సా నుంచి రత్నేష్ సదా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుంచి ధుమల్ సింగ్, రాజ్‌గిర్ నుంచి కౌశల్ కిషోర్ పోటీ చేస్తున్నారు.

243 స్థానాలు ఉన్న బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షాలైన బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల్లో పోటీ చేయాలని ఇటీవల సీట్ల ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలో భాగంగా లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్‌) 29 చోట్ల, హిందుస్థాన్‌ అవాం మోర్చా (హెచ్‌ఏఎం) ఆరుచోట్ల, రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) ఆరుచోట్ల బరిలో దిగేలా సీట్ల సర్దుబాటు కుదిరింది. న్డీఏ కూటమి చేసుకున్న సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం జేడీ(యూ) 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించగా.. ప్రస్తుతం 57 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో లోక్ జన్ శక్తి పార్టీకి కేటాయించిన నాలుగు స్థానాలు ఉండటంతో వివాదస్పదంగా మారింది.

జేడీయూ ప్రకటించిన స్థానాల్లో రాజోగిర్‌ నుంచి కౌశల్‌ కిషోర్‌, కళ్యాణ్‌పుర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్‌బార్సా నుంచి రత్నేష్ సదా, మోకామా నుంచి అనంత్ సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుష్వాహాలు, రాయ్ రంజన్ నుంచి మంత్రి విజయ్ కుమార్ చౌదరికి టిక్కెట్టు దక్కింది. మరోవైపు టికెట్‌ పంపిణీపై అనేకమంది జేడీ(యూ) నేతలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో నిర్వహించనున్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.