CM Mamata Banerjee | నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించిన మమత

కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా నీతి ఆయోగ్‌ సమావేశాలను బహిష్కరించాలన్న ప్రతిపక్ష ముఖ్యమంత్రుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. జూలై 27న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నారు.

CM Mamata Banerjee | నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించిన మమత

ఎనిమిదికి పెరిగిన ప్రతిపక్ష సీఎంల సంఖ్య
బడ్జెట్లో వివక్షకు నిరసనగా ముఖ్యమంత్రుల నిర్ణయం

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా నీతి ఆయోగ్‌ సమావేశాలను బహిష్కరించాలన్న ప్రతిపక్ష ముఖ్యమంత్రుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. జూలై 27న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో వివక్షకు నిరసనగా ఈ సమావేశానికి హాజరుకాకూడదని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్టు తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలను తీవ్ర వివక్షకు గురి చేశారని ఆరోపిస్తూ నీతి ఆయోగ్‌ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి రోజే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. నీతి ఆయోగ్‌ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన తర్వాత కాంగ్రెస్‌ పాలిత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాము కూడా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
సీపీఎంకు చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చాకు చెందిన జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ కూడా ఇదే తరహా ప్రకటనలు చేశారు.

జూలై 23వ తేదీ సాయంత్రం నిర్వహించిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సభాపక్ష నేతల సమావేవంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రతిపక్ష నేత ఒకరు చెప్పారు. మోదీ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎన్డీయే కీలక భాగస్వామ్య పార్టీల పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాలకు మొండి చేయి చూపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదు.

272 సీట్ల మెజార్టీకి గాను 240 సీట్లే బీజేపీ గెలువగలిగింది. దీంతో టీడీపీ, జేడీయూ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ మనుగడ ఈ రెండు పార్టీలపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలోనే ఆ రెండు రాష్ట్రాలకు భారీగా నిధులు ఇచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వాటికి నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ.. అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలని ఇండియా కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు.