స్టాలిన్ స్టైల్ అనుకరణతో సీఎం విజయ్ కౌంటర్

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ స్టాలిన్ అభివాద శైలిని అనుకరిస్తూ కౌంటర్ ఇచ్చారు. నీట్, హిందీ వివాదం, అవినీతి అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్‌ పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చేసిన ప్రసంగాన్ని ముగించే సమయంలో మాజీ సీఎం స్టాలిన్ అభివాదం స్టైల్ ను అనుకరించి చూపడం ఆసక్తి రేపింది. విజయ్ తన ప్రసంగంలో హిందీ వివాదం, నీట్‌, కరూర్‌ తొక్కిసలాట, వారసత్వ రాజకీయాలు వంటి పలు అంశాలను ప్రస్తావించిన ప్రస్తావిస్తూ…తనపై వచ్చిన విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

యాక్టర్ గా కాదు..జననేతగా అధికారంలోకి…

మాది యాక్టర్ పార్టీ అన్నారని, సినిమా షూటింగ్ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ గేలి చేశారని గుర్తు చేస్తూ..మాకు అధికారం అంత సులువుగా రాలేదని విజయ్ స్పష్టం చేశారు. సాధారణంగా చాలా మంది రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తారు. కానీ, నేను ప్రజల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశానని, నాపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారు అని విజయ్‌ అన్నారు. తమిళనాడు ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు నేను, నా పార్టీ ఎన్నో కుట్రలు, సవాళ్లను అధిగమించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నన్ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ఓ దశలో దాదాపుగా కలిసిపోయాయని చురకలేశారు. కేవలం ఒక కుటుంబానికే ప్రాధాన్యమివ్వడం మా రాజకీయ విధానం కాదంటూ పరోక్షంగా డీఎంకేపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి మా సేవలందిస్తాం. అదే మా రాజకీయం. అదే మా పాలనా విధానం అని విజయ్‌ పేర్కొన్నారు.

రాజకీయాలలో ఇంత క్రూరత్వంగా ఉంటాయా?

విజయ్ తన ప్రసంగంలో ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ…41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన నన్ను ఎంత వేదనకు గురిచేసిందో మాటల్లో చెప్పలేనని, ఆ బాధ నన్ను ఎన్నటికీ వదలదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఘటన విషయంలోనూ మాపైనే నిందలేశారని.. ఇది అత్యంత దారుణంగా అనిపించింని, రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా?’’ అని ఆందోళన కల్గిందని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నీట్‌ విధానం విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడులో ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు. అయితే తమిళనాడు అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో తాము సయోధ్యగానే ఉంటామని స్పష్టం చేశారు. అయితే, సిద్ధాంతపరంగా మాత్రం తాము బీజేపీ విధానాలను, వారి ఐడియాలజీని పూర్తిగా వ్యతిరేకిస్తామని సీఎం విజయ్ సభలో తేల్చిచెప్పారు.

గత ప్రభుత్వాల అవినీతిపై కఠిన చర్యలు

గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ‘తమిళనాడులో అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే, ఎంతటి పెద్ద స్థానంలో ఉన్నా సరే.. వారిని వదిలే ప్రసక్తే లేదు’ అని సీఎం కుండబద్దలు కొట్టారు. మేం అధికారంలోకి వచ్చి కేవలం కొన్ని రోజులే అవుతోందని.. అప్పుడే మా ప్రభుత్వంపై విమర్శలు, బురదజల్లడం ఏంటి?’ అని విజయ్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వాలని, ప్రజలు ఆశించిన అవినీతి రహిత మార్పును క్షేత్రస్థాయిలో కచ్చితంగా చూపించి తీరుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అయితే డీఎంకే ప్రభుత్వంపై సీఎం విజయ్ నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ డీఎంకే సభ్యులు, ఉదయ్ నిధి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలుమార్లు సీఎం ప్రసంగానికి అడ్డుతగిలారు.

Latest News