North Karnataka State Demand | ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. అనేక దశాబ్దాలుగా అక్కడో ఇక్కడో.. ఎక్కడో ఒక చోట దీని ప్రస్తావన వస్తూనే ఉన్నది. కానీ.. ఆయా ప్రభుత్వాలు సహజంగానే ఆ డిమాండ్‌ను నొక్కిపెడుతూ వచ్చాయి. కానీ.. కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌కే చెందిన ఎమ్మెల్యే ఒకరు తమకు 15 జిల్లాలతో ప్రత్యేక ఉత్తర కన్నడ జిల్లా కావాలంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు లేఖ రాయడం ఇప్పుడు సంచలనం రేపుతున్నది. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న సంఘాలు, వ్యక్తులకు కొత్త ఆశ చిగురిస్తున్నది.
ఉత్తర కర్ణాటక దశాబ్దాలుగా అన్ని రంగాల్లో అన్యాయానికి, వివక్షకు, నిర్ల్యక్ష్యానికి గురైందని పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరంగౌడ (రాజు) ఖగే రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు. తమ ప్రాంతాన్ని కర్ణాటక నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తర కర్ణాటక పోరాట సంఘం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఖగే ఎమ్మెల్యే రాజు ఖగే పేర్కొన్నారు. బీదర, కలబురగి, విజయపుర, యాదగిర, బాగల్‌కోట్, బెళగావి, ధారవాడ, గడగ, కొప్పళ, రాయిచూర్, ఉత్తర కన్నడ, హవేరీ, విజయనగర, బళ్లారి, దావణగెరె జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పటు చేయడం వల్ల పరిపాలన సౌలభ్యం ఉంటుందని, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
Talking Crow Viral Video : కాకి మాట్లాడుతుంది…రష్యా భాషలో..వైరల్ వీడియో
వాయవ్య కర్ణాటక రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా ఖగే వ్యవహరిస్తున్నారు. తమ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదని గతంలో కూడా ఆయన తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. రాజ్యాంగంలోని 371(జే) ప్రకారం ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉన్న కల్యాణ కర్ణాటక ప్రాంతంతో పోల్చితే కొద్ది ప్రదేశాలు మినహాయిస్తే కిట్టూర్ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, అందుకే ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రాన్ని కోరుకోవడంలో తప్పేమీ లేదని సెప్టెంబర్ నెలలో రాజు ఖగే వ్యాఖ్యానించారు.
కర్ణాటక ఏకీకరణ నాటి నుంచీ ఈ ప్రాంతం ఇప్పటి వరకూ అన్ని రంగాల్లో అన్యాయాన్ని, వివక్షను, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నదని తన లేఖల్లో ఖగే పేర్కొన్నారు. ‘ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మరో గొప్ప కన్నడ భాషా రాష్ట్రం ఆవిర్భవిస్తుంది. అది మా అందరికీ ఎంతో గర్వకారణం. ఉత్తర కర్ణాటకలో అన్ని రకాల అద్భుతమైన వనరులు ఉన్నాయి. కన్నడ భాష పరిరక్షణకు, కర్ణాటక ఏకీకరణకు ఈ ప్రాంతం గొప్ప కృషి సల్పింది’ అని ఆయన ఆ లేఖలో తెలిపారు. ఉత్తర కర్ణాటక స్ట్రగుల్ కమిటీ ప్రతినిధులు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన ఖగే.. ఇప్పటికే కోటిమందికిపైగా ప్రజలు తమ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించి, సంతకాలు చేశారని తెలిపారు. ‘ఈ ప్రాంతంలోని అన్ని సెక్షన్ల ప్రజలు తమ సమగ్ర, సంఘటిత అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అందుకే.. మా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని, ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పటుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని వినయపూర్వకంగా కోరుతున్నాను’ అని ఆయన ఆ లేఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఈ ఏడాది జనవరి 3వ తేదీన రాష్ట్రపతికి, జనవరి 5వ తేదీన ప్రధాన మంత్రి కార్యాలయంలో మెమొరాండాలు సమర్పించినట్టు తెలిపారు.
Read Also |
Europe’s Pre-Christian Winter Festivals : క్రిస్మస్ ముందు..భయపెట్టనున్న క్రాంపస్ పరేడ్ లు
Ricin is Weapon | ఆముదమే ఆయుధం : ఉగ్రకుట్రలో ఆముదపు విషం ఆనవాళ్లు
Earth’s magnetic field | భూ అయస్కాంత క్షేత్రం బలహీనపడుతున్నదా? దానితో విపత్తులేంటి?
