బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు: కేజ్రీవాల్

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నిమార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. బీజేపీ నేతలు ఎప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకమేనని ఆరోపించారు. ఎ

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు: కేజ్రీవాల్

ల‌క్నో: బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నిమార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. బీజేపీ నేతలు ఎప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకమేనని ఆరోపించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కలిసి లక్నోలో నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ…’నేను నాలుగు విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ.. తన కోసం కాకుండా అమిత్‌ షాను ప్రధాని చేయడానికి ఓట్లు అడుగుతున్నారు.

రెండోది బీజేపీ అధికారంలోకి వస్తే 2-3 నెలల్లో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఆయన పదవి నుంచి తొలిగిస్తారు. మూడోది రాజ్యాంగాన్ని మార్చబోతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగోది జూన్‌ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది’ అన్నారు.
2025 సెప్టెంబర్‌ 17 నాటికి 75 ఏళ్లు నిండుతాయని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను తన వారసుడిగా చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఎన్డీఏ బీజేపీకి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయన్నారు. జూన్‌ 4 ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతుందని ఢిల్లీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే మీడియా సమావేశంలో ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి గురించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి సీఎం మౌనం వహించారు. ఈ సమయంలోనే ఆ పార్టీ నేత సంజయ్‌ సింగ్ మైక్‌ తీసుకుని ఎదురు ప్రశ్నలు వేశారు.

సంజయ్‌ మాట్లాడుతూ.. ‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. లైంగిక దౌర్జన్యం కేసులో జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి వాటి సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. దేశ రాజధాని జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనలో అప్పుడు ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న స్వాతి మాలీవాల్‌ మద్దతు ప్రకటించారు. అప్పుడు ఆమెను పోలీసులు ఈడ్యుకెళ్లి కొట్టారు. వీటన్నింటిపై కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మౌనంగా ఉన్నది. ఆప్‌ ఒక కుటుంబం. మా పార్టీ వైఖరి స్పష్టం చేసింది.

నేను లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని కోరుతున్నాను.. రాజకీయాలు చేయకండి’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీనికంటే ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయంటూ మీడియా ప్రశ్నకు అఖిలేశ్‌ జవాబు ఇచ్చారు. మాలీ వాల్‌పై కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్ దాడి చేసిన మాట వాస్తవమేనని సంజయ్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే మాలీవాల్‌పై దాడి ఘటనలో బిభవ్‌ కుమార్‌ కు జాతీయ మహిళా కమిషన్‌ గురువారం సమన్లు ఇచ్చింది. శుక్రవారం 11 గంటలకు కమిషన్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీస్‌లో పేర్కొన్నది.