KCR | రాజకీయాలు( Politics ) అంటే చాలా మందికి మక్కువ. పంచాయతీ( Gram Panchayat ) నుంచి పార్లమెంట్( Parliament ) వరకు ఏదో ఒక పదవిలో ఉండాలని చాలా మంది రాజకీయ నాయకులు( Political Leaders ) కలలు కంటుంటారు. అందుకోసం గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు మెంబర్ స్థానం నుంచి కొందరు.. విద్యార్థి సంఘాల నాయకులుగా మరికొందరు తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారు. అలా వార్డు మెంబర్, సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీగా రాజకీయాల్లో పోటీ చేసి గెలవాలని ఆరాటపడుతుంటారు. అంతకంతకు తమ స్థాయిని, హోదాను పెంచుకోవాలని ఆశపడుతుంటారు. సీఎం, పీఎం పీఠాన్ని అధిరోహించాలని కూడా ఆరాటపడుతుంటారు. కానీ మాజీ ఎమ్మెల్యే కేసీఆర్( KCR ) మాత్రం అలా ఆరాటపడటం లేదు.. అసెంబ్లీ( Assembly )లో అడుగుపెట్టి ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో( Local Body Elections ) పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. మరి ఈ కేసీఆర్ ఎవరు..? ఆయన పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయాలను తెలుసుకుందాం.
కేరళ( Kerala )లోని పథనంతిట్ట( Pathanamthitta )కు చెందిన కేసీ రాజగోపాలన్( KC Rajagopalan )(75) గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. అవివాహితుడైన ఈయన వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కేసీ రాజగోపాలన్‌ను స్థానికులు ముద్దుగా కేసీఆర్( KCR ) అని పిలుచుకుంటారు. ఇక ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయనకు ఇంటి వద్ద ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. 75 ఏండ్ల వయసులోనూ ప్రజలకు సేవ చేయాలని సంకల్పించారు. దీంతో కేరళ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంపై కేరళ అంతా ఆసక్తి నెలకొంది. మెజువేలి గ్రామ పంచాయతీలోని ఎనిమిదో డివిజన్ నుంచి కేసీ రాజగోపాలన్ పంచాయతీ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
పోటీ ఏ పార్టీ తరపున అంటే..?
కేసీ రాజగోపాలన్ సీపీఎం పార్టీ తరపున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏడు పదుల వయసు దాటినా నవ యువకుడిలా కష్టపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేసీఆర్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వీధుల్లో తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో వేగం పెంచిన కేసీఆర్‌ను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
వీఎస్ అచ్యుతానందన్ అంటే అభిమానం
అలాగే కేసీఆర్ తన ప్రచార పోస్టర్లలో సీపీఎం దిగ్గజం, దివంగత వీఎస్ అచ్యుతానందన్ ఫొటోను ఉంచారు. అచ్యుతానందన్ సీఎంగా ఉన్న సమయంలోనే కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో తనను వీఎస్ అచ్యుతానందన్ తన సొంత కొడుకులా చూసుకునేవారని కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. వీఎస్‌ను తలచుకుంటే తనకు కన్నీళ్లు ఆగవని చెప్పారు. ప్రతిపక్షాలు కూడా తాను గెలవాలని కోరుకుంటున్నాయని అన్నారు.
పాగా వేసేందుకు సీపీఎం సూపర్ స్కెచ్
మెజువేలి గ్రామ పంచాయతీలో మొత్తం 14 వార్డులు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 6, యూడీఎఫ్ 7 వార్డులు గెలుచుకున్నాయి. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు కేసీఆర్‌ను పోటీకి దింపి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని సీపీఎం భావించింది. ఆ గ్రామ పంచాయతీలో మళ్లీ పునర్‌వైభవం సాధించాలని ప్లాన్ చేసింది.
కేసీఆర్ రాజకీయ జీవితం ఇలా..
కేసీఆర్ రాజకీయ జీవితం 1979లో జరిగిన పంచాయతీ ఎన్నికలతో ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మెజువేలి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1988లో మెజువేలి పంచాయతీ అధ్యక్షుడయ్యారు. 2006లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అరణ్ముల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
ఎన్నికలు ఎప్పుడంటే..?
కేరళలోని గ్రామ పంచాయతీలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, ఎర్నాకులంలో డిసెంబర్ 9న, త్రిశూర్, మలప్పురం, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్, కాసరగడ్, కోజీకోడ్‌లో డిసెంబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
