దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం
జమ్ముకశ్మీర్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన దాల్ సరస్సులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేక హౌస్‌బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి

- అగ్నికి ఆహుతైన అనేక హౌస్‌బోట్లు
- కోట్ల రూపాయల మేర నష్టం
విధాత: జమ్ముకశ్మీర్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన దాల్ సరస్సులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేక హౌస్‌బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులోని ఘాట్ నంబర్- 9 సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.
సమీపంలోని ఇతర హౌస్‌బోట్‌లు, ఇతర చెక్క నివాస నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. కనీసం ఐదు హౌస్‌బోట్లు, మూడు గుడిసెలు దెబ్బతిన్నాయి. రివర్ స్టేషన్ నెహ్రూ పార్క్, బాట్మలూ, గావ్‌కడల్ నుంచి అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరాయి. మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.