కర్ణాటక మాజీ స్పీకర్ డీబీ చంద్రేగౌడ మృతి

- వృద్ధాప్య సమస్యలతో స్వగృహంలో తుదిశ్వాస
విధాత: కర్ణాటక మాజీ స్పీకర్, మాజీ మంత్రి డీబీ చంద్రేగౌడ ఇక లేరు. ఆయన వయసు 87 సంవత్సరాలు. చిక్కమగలూరు జిల్లా ముదుగెరె తాలూక దారదహళ్లిలోని తన స్వగృహంలో మంగళవారం తెల్లవారుజామున వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముదిగెరెలోని అడ్యంతయ రంగమందిరంలో భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.
బుధవారం (నవంబర్ 8) ఆయన ఎస్టేట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1936 ఆగస్టు 26న జన్మించిన ఆయనను సన్నిహితులు డీబీసీ అని పిలిచేవారు. ఆయనకు భార్య పూర్ణ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గౌడ మృతి పట్ల రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
చంద్రేగౌడ కాంగ్రెస్, జనతాదళ్, బీజేపీతో కలిసి పనిచేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. 1971లో రాజకీయాల్లో అడుగుపెట్టిన డీబీ చంద్రే గౌడ.. చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు.
1977లో రెండోసారి కూడా ఇదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే, చిక్కమగళూరు నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసేందుకు ఆయన తన ఎంపీ పదవికి 1978లో రాజీనామా చేశారు. అక్కడి నుంచి గెలిచిన ఇందిరగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. డీబీ చంద్రే గౌడ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.