ఢిల్లీలో ముదిరిన మంచినీటి ఎద్దడి

ఢిల్లీలో నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్‌ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్‌ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. చత్తార్‌పూర్‌ ప్రాంతంలో పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జల్‌ బోర్డు కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు

  • Publish Date - June 16, 2024 / 06:08 PM IST

జల్‌ బోర్డు వద్ద బీజేపీ విధ్వంసం
తాగునీటి ఎద్దడి వెనుక కుట్రలున్నాయన్నమంత్రులు

విధాత : ఢిల్లీలో నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్‌ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్‌ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. చత్తార్‌పూర్‌ ప్రాంతంలో పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు జల్‌ బోర్డు కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. అయితే ఈ ఘటనపై బీజేపీ నేత రమేష్‌ బిధూరి స్పందించారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏమైనా చేయగలరన్నారు. ప్రజలను శాంతింపచేసి బీజేపీ కార్యకర్తలు వారిని నిలువరించారని చెప్పారు. ఇది ప్రజల, ప్రభుత్వ ఆస్తి అని, వీటిని ధ్వంసం చేయడం తగదన్నారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాగునీటి సమస్య వెనుక కుట్రలు : మంత్రి అతిషి
ఢిల్లీ వాసుల నీటి కష్టాలను మరింత పెంచేందుకు పైప్‌లైన్‌ ధ్వసం చేసే కుట్ర జరుగుతుందని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతోనే దక్షిణ ఢిల్లీలో 25శాతం నీటి కొరత ఏర్పడిందన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ఆమె లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైపులైన్లకు భద్రత కల్పించాలని కోరారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని.. నీటి కొరత సైతం ఉందన్నారు. ఈ క్రమంలో నీటి పైప్‌లైన్లను పగులగొట్టి కొరతను మరింత తీవ్రతరం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోందన్నారు. దక్షిణ ఢిల్లీలోని సరఫరా పైప్‌లైన్‌లో నిన్న భారీ లీకేజీ ఏర్పడిందని.. ఈ విషయం తెలుసుకున్న తమ బృందం.. మరమ్మతుల కోసం ఓ టీమ్‌ని పంపగా.. చాలా పెద్ద బోల్టులు కోసి ఉన్నట్లుగా గుర్తించారన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పైపులైన్లకు పోలీసుతో రక్షణ కల్పించాలని కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. మరో మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా పైప్‌లైన్ల లీకేజీలకు ఎవరో కావాలని పాల్పడుతున్నారని ఆరోపించారు. నిన్న దక్షిణ ఢిల్లీలో పైపులు కట్టే నట్‌లు, బోల్ట్‌లు కోసి కనిపించాయన్నారు. వాటిని ఎవరో కట్‌ చేశారని.. దాంతో దక్షిణ ఢిల్లీలో నీళ్లు లేవన్నారన్నారు. పైప్‌లైన్ల ధ్వంసం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని.. ప్రజలు సైతం నిఘా వేసి ఉంచాలని కోరారు.

 

Latest News