భారత్ లో కొత్త వజ్రాల గని.. త్రవ్వకాల్లో దొరికిన వజ్రాలు!

ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా-బెల్ముండి డైమండ్ బ్లాక్‌లో త్రవ్వకాల్లో 5 వజ్రాలు లభించాయి. భారత్‌లో కొత్త వజ్రాల గనులపై ఆశలు చిగురిస్తున్నాయి.

భారత్ లో కొత్త వజ్రాల గనులు అన్వేషణలో NMDC-CMDC లిమిటెడ్ కీలక పురోగతి సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌ జిల్లాలో సారాయిపాలి ప్రాంతంలోని బలోడా-బెల్ముండి డైమండ్ బ్లాక్‌లో బల్క్ శాంపిల్ టెస్టింగ్‌లో 1.22 క్యారెట్ల బరువున్న ఐదు వజ్రాలు లభ్యమయ్యాయి. 200 టన్నుల శిలలను శుద్ధి చేసిన తర్వాత, 1.22 క్యారెట్ల బరువున్న 5 వజ్రాలను వెలికితీశారు. వెలికితీసిన వజ్రాలలో వరుసగా 0.19 క్యారెట్లు, 0.06 క్యారెట్ల బరువున్న రెండు రత్నశ్రేణి, తెల్లటి వజ్రాలు ఉన్నాయి. అదనంగా, 0.32 క్యారెట్ల బరువున్న ఒక పసుపు రంగు రత్నరహిత వజ్రం, 0.59 క్యారెట్లు, 0.06 క్యారెట్ల బరువున్న రెండు గోధుమ రంగు రత్నరహిత వజ్రాలు కూడా లభించాయి. ఈ విషయాన్ని NMDC-CMDC లిమిటెడ్ ధృవీకరించింది. లభించిన వజ్రాలన్నింటినీ భద్రత కోసం పన్నాలోని ఎన్‌ఎమ్‌డీసీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కోత, పాలిషింగ్ కేంద్రం అయినప్పటికీ… ఇప్పటికీ దిగుమతి చేసుకునే ముడి వజ్రాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చత్తీస్ గఢ్ బలోడా-బెల్ముండి డైమండ్ బ్లాక్‌లో వజ్రాల అన్వేషణ..దేశీయంగా వజ్రాల గనుల గుర్తింపు దిశగా కొత్త ఆశలు రేపింది. వజ్రాల అన్వేషణ ప్రారంభ దశలో ఉండగానే, వాటిలో రెండు రత్న-నాణ్యత గల వజ్రాలు లభ్యం కావడం ఎంతో ప్రోత్సాహకరమైన విషయం అని, ఈ ప్రాంతం కింద ఇంకా చాలా పెద్ద వజ్రాల నిక్షేపాలు ఉండవచ్చని ఈ ఆవిష్కరణ సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్ భారతదేశపు తదుపరి ప్రధాన వజ్రాల ఉత్పత్తి ప్రాంతంగా ఆవిర్భవించగలదనే ఆశలు చిగురించాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest News