ఓటు విలువ తెలిసిన విక‌లాంగుడు.. కాలితో ఓటేశాడు..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా మంగ‌ళ‌వారం మూడో విడుత ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది

ఓటు విలువ తెలిసిన విక‌లాంగుడు.. కాలితో ఓటేశాడు..

అహ్మ‌దాబాద్ : సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా మంగ‌ళ‌వారం మూడో విడుత ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది. ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అయితే ఓ విక‌లాంగుడు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకుని ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలిచాడు. రెండు చేతులు లేక‌పోయిన‌ప్ప‌టికీ, కాలితో ఓటేసి వార్త‌ల్లో నిలిచాడు. గుజ‌రాత్‌లోని న‌దియాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆ విక‌లాంగుడు ఓటు హ‌క్కు వినియోగించుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా అత‌ను మాట్లాడుతూ.. నా పేరు అంకిత్ సోని. విద్యుత్ షాక్ కార‌ణంగా 20 ఏండ్ల క్రితం నా రెండు చేతుల‌ను కోల్పోయాను. అయిన‌ప్ప‌టికీ ధైర్యంగా ముందుకు క‌దిలాను. త‌ల్లిదండ్రులు, టీచ‌ర్ల స‌హ‌కారంతో కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను. ఓటు హ‌క్కు క‌చ్చితంగా వినియోగించుకోవాలి. నాకు రెండు చేతులు లేన‌ప్ప‌టికీ కాలితో ఓటు వేశాను. మీరంతా కూడా పోలింగ్ కేంద్రాల‌కు చేరుకొని ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అంకిత్ సోని విజ్ఞ‌ప్తి చేశాడు.