Site icon vidhaatha

ఢిల్లీని కుదిపేసిన భారీ వర్షం.. విమానాశ్రయంలో పైకప్పు విరిగిపడి ఒకరి మృతి

న్యూఢిల్లీ: శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని నగరం ఢిల్లీలో కుంభవృష్టి కురిసింది. 2009 తర్వాత ఇంతటి భారీవర్షం కురువలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ వర్షం ధాటికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఒకటవ టెర్మినల్‌లో ఉదయం ఐదు గంటల సమయంలో పైకప్పు కూలిపోవడంతో ఒకరు చనిపోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని వెంటనే సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌కు తరలించారు. రేకులు ఎగిరిపడి అక్కడి క్యాబ్‌లపై పడటంతో చాలా వరకూ ధ్వంసమయ్యాయి. వర్షం తీవ్రతకు నగరంలో అనేక ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. మూడు గంటల వ్యవధిలో 148 మిలీమీటర్ల వర్షం కురిసింది. విమానాశ్రయంలో మధ్యాహ్నం రెండింటి వరకూ విమానాల రాకపోకలను నిలిపివేశారు.
సఫ్దర్‌జంగ్‌ బేస్‌ స్టేషన్‌ వద్ద ఉదయం 8 గంటల సమయానికి 24 గంటల వ్యవధిలో 228.1 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. జూన్‌ నెలలో 24 గంటల వ్యవధిలో 235.5 మిల్లీ మీటర్ల వర్షం పడటం 1936 జూన్‌ 28 తర్వాత ఇదే మొదటిసారి అని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

భారీ వర్షంతో నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ చుక్కలు చూపించింది. రింగ్‌ రోడ్, ఔటర్‌ రింగ్‌రోడ్డు, మింటో బ్రిడ్జి, ప్రగతిమైదాన్‌, ధౌలాకౌన్‌, మథుర రోడ్డు.. తదితర ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు నగరంలోని ఆవాస ప్రాంతాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. పలు అపార్ట్‌మెంట్లలోని బేస్‌మెంట్లు నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీళ్లతో నిండిపోయాయి. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
భారీ వర్షం కారణంగా యశోభూమి ద్వారక సెక్టార్‌ మెట్రోస్టేషన్‌లోకి రాకపోకలను నిలిపివేశారు. ఢిల్లీ ఏరోసిటీ మెట్రోస్టేషన్‌ నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయం ఒకటో టెర్మినల్‌కు వెళ్లే షటిల్‌ సర్వీస్‌ను కూడా నిలిపివేశారు.

Exit mobile version