దేశంలోని పది రూట్లలో ప్రయోగాత్మకంగా హైడ్రోజన్‌ బస్సులు : నితిన్‌ గడ్కరీ

దేశంలో హైడ్రోజన్‌తో నడిచే వాహనాల వినియోగం దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకున్నది. దేశంలోని ఎంపిక చేసిన పది ప్రధాన రహదారుల్లో హైడ్రోజన్‌ వాహనాలను ప్రయోగాత్మకంగా నడిపించనున్నట్టు కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే.. స్వచ్ఛ ఇంధన ఆధారిత రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభించనున్నది.

ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం అభివృద్ధిలో భాగంగా దేశంలో పది ప్రధాన రూట్లలో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలను ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా నడిపిస్తున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. గ్రేటర్ నొయిడా – ఢిల్లీ – ఆగ్రా, భువనేశ్వర్ – కోణార్క్ – పూరి, అహ్మదాబాద్ – వడోదర – సూరత్, షహీదాబాద్ – ఫరీదాబాద్ – ఢిల్లీ, పుణె – ముంబై, జంషెడ్‌పూర్‌– కళింగ నగర్‌తోపాటు తిరువనంతపురం – కొచ్చి, కొచ్చి – ఎడప్పల్లి, జామ్ నగర్ – అహ్మదాబాద్, విశాఖపట్నం – బయ్యవరం రోడ్లపై కూడా హైడ్రోజన్ ఇంధనంతో వాహనాలను నడిపిస్తున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా పట్టణ ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు, కోస్తా తీరం లోని ఈ పది రోడ్లపై హైడ్రోజన్ వాహనాల ను ప్రయోగాత్మకంగా తిప్పుతున్నామన్నారు. రవాణా రంగంలో హైడ్రోజన్ వాహనాలదే భవిష్యత్తు అని ఆయన అన్నారు.

గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్ లో జరిగిన భారత్ పర్వాస్ అవార్డుల కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశంలోని వాహన తయారీదారు సంస్థలు పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా బయో ఫ్యూయల్ తో నడిచే వాటిపై పనిచేస్తున్నాయని, నూతన సాంకేతికతతో ప్రపంచ వాహన రంగంలో భారత్ పోటీ పడుతుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టం లేకుండా, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా వాహన పరిశ్రమ యజమానులు బస్సులను తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్షికంగా దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, ఇందులో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయే వారిలో 66 శాతం మంది వయస్సు 18 నుంచి 36 ఏళ్ల లోపేనని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ జీడీపికి 3 శాతం నష్టం వాటిల్లుతున్నది గడ్కరీ వివరించారు. ఈ దుర్ఘటనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు పెద్ద పీట వేస్తున్నదన్నారు. తను కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే నాటికి ప్రపంచంలో భారత్ వాహన పరిశ్రమ స్థానం ఏడవ స్థానం ఉండగా ఇప్పుడది మూడో స్థానానికి చేరుకుందని అన్నారు. వాహన పరిశ్రమ ఉత్పత్తి విలువ రూ.14 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షలకు పెరగడం సంతోషాన్ని ఇస్తున్నదన్నారు.

ఈ పరిశ్రమ 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, కేంద్ర, రాష్ట్రాలకు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయన్నారు. దేశ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలో అగ్రగణ్యంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుని ముందకు వెళ్తున్నదని అన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి ఏడాది 3 లక్షల నూతన బస్సుల అవసరం ఉండగా, 80వేల కు మించి తయారు కావడం లేదన్నారు. ఇందుకోసం ఉత్పత్తిని మూడింతలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. లిథియం ఆయాన్ బ్యాటరీల ఖర్చు తగ్గుతున్నందున, ఆ ప్రయోజనాలను వాహనదారులకు చెందేలా చూడాలని ఎలక్ట్రిక్ బస్సు తయారీదారులను కోరారు. ఎలక్ట్రిక్ బస్సు, కారు, ట్రక్కుల ఛార్జింగ్ కు ప్రస్తుతం ఒక యూనిట్ కు రూ.20 ఖర్చు చేస్తున్నారని, ఈ వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ బస్సు డిజైనింగ్ ను మార్చుతూ నూతన నిబంధనలు గతేడాది సెప్టెంబర్ నెలలో తీసుకువచ్చామన్నారు. బస్సులు తయారు చేసే పరిశ్రమల కోసం టెస్టింగ్ ఛార్జీలను 50 శాతం తగ్గించడమే కాకుండా, ఫిట్ నెస్ చేసే సమయాన్ని 16 వారాల నుంచి 6 వారాలకు కుదించామన్నారు. దేశంలో ప్రైవేటు బస్ పోర్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. గ్రీన్ ఫీల్డు ఎక్స్ ప్రెస్ వే ల నిర్మాణంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, వాహనాల జీవితకాలం పెరుగుతుందన్నారు.

Latest News