సిద్ధమవుతున్న హైస్పీడ్ కారిడార్లు.. ఆ నగరాల మధ్య మెరుగైన రవాణా సదుపాయం.. రియల్ ఎస్టేట్‌కు బూమ్
పారిశ్రామిక, వాణిజ్య, ఆధ్యాత్మిక నగరాలు, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు, ఆ యా నగరాల మధ్య సరుకు రవాణాను, ప్రయాణాలను వేగవంతం చేసేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు సిద్ధమవుతున్నాయి. 2030 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వస్తే.. భారత రహదారుల నెట్‌వర్క్.. ప్రపంచంలోనే అత్యాధునిక నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారబోతున్నది. భారత్ మాట పరియోజన కింద వీటిని చేపడుతున్నారు.
భారత రహదారుల నెట్‌వర్క్.. వేగంగా మారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గతి శక్తి, భారత్‌మాల పరియోజన ప్రాజెక్టుల కింద అనేక అనేక మెగా ప్రాజెక్టులు వేగంగా నిర్మాణమవుతున్నాయి. వీటిలో చాలా వరకూ 2026 –2028 మధ్యలోనే ప్రారంభోత్సవాలు కూడా చేసుకోనున్నాయి. ప్రయాణ వేగం పెంచడంతోపాటు.. పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులు, ఆధ్యాత్మిక ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం, సరుకు రవాణా ఖర్చలు తగ్గించడం, ఎగుమతులకు ఊతమివ్వడం ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రాజెక్టులు చేపట్టారు. అంతేకాదు.. భవిష్యత్తులో వీటిని 8 లేన్లకు విస్తరించే వెసులుబాటు కూడా ఉన్నది.
ఈ ప్రాజెక్టులతో 2030 నాటికి భారత దేశ రహదారి వ్యవస్థ ప్రపంచంలోనే అత్యాధునిక హైవే నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులతో లక్షలకొద్దీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. కొత్త పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు కావడంతోపాటు.. పర్యాటక రంగం కూడా అభివృద్ధి అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆయా రహదారుల పరిధిలో రియల్ ఎస్టేట్ గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశాలూ ఉన్నాయి.
ఢిల్లీ–అమృత్‌సర్–కత్రా ఎక్స్‌ప్రెస్ హైవే
ప్రస్తుతం దేశంలో నిర్మితమవుతున్న హైవే ప్రాజెక్టుల్లో ఢిల్లీ–అమృత్‌సర్–కత్రాఎక్స్‌ప్రెస్ హైవే అత్యంత పెద్దది. 670 కిలోమీటర్ల ఈ హైవేను.. 40వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. 2026 జూన్ లేదా జూలై నెలల్లో దీన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే ప్రధాన ఆధ్యాత్మిక, వ్యాపార సెంటర్ల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది.
యూపీ, బీహార్ ఎక్స్‌ప్రెస్ హైవేస్
ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్–కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 320 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఇది 2027వ సంవత్సరం ప్రారంభానికి సిద్ధం కానుంది. అలీగఢ్, ఫరూఖాబాద్ వంటి నగరాల మధ్య కనెక్టివిటీని ఈ కారిడార్ పెంచనున్నది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
బీహార్‌లో అమాస్–దర్భంగా ఎక్స్‌ప్రెస్ హైవే 2026 చివరి నాటికి అందుబాటులోకి రానున్నది. దీని పొడవు 189 కిలోమీటర్లు. ఉత్తర, మధ్య బీహార్ ప్రాంతాల కనెక్టివిటీని ఇది మెరుగుపరుస్తుంది.
బెంగళూరు–విజయవాడ కారిడార్
దక్షిణ భారతదేశంలోనే ప్రధాన కనెక్టివిటీ మార్గంగా నిలువనున్నది బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే. ఆరు లేన్లతో అభివృద్ధి చేస్తున్న ఈ కారిడార్ అంచనా వ్యయం రూ.19,320 కోట్లు. 2026–27 మధ్యలో దీన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య సరుకు రవాణాను మరింత వేగవంతం చేయనున్నది.
చెన్నై–నాసిక్ మెగా హైవే
దేశంలో చేపడుతున్న భారీ రహదారి ప్రాజెక్టుల్లో చెన్నై–నాసిక్ మెగా హైవే కూడా ఒకటి. దీని పొడవు 900 కిలోమీటర్లు. 45వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను కలుపుతుంది. 2028 తొలినాళ్లలో ఇది అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
పుణె రింగ్ రోడ్
పుణె నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పుణె ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ చెక్ పెట్టనున్నది. 173 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. ఈ రింగ్‌రోడ్ పశ్చిమ భాగం 2026 నాటికి పూర్తి అవుతుందని అంచనా. తూర్పు భాగం 2028 వరకూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వారణాసి–రాంచీ–కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ హైవే
వారణాసి–రాంచీ–కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇది తూర్పు భారతదేశ వాణిజ్య కనెక్టివిటీకి బలమైన ఊతమిస్తుందని భావిస్తున్నారు. దీని పొడవు 610 కిలోమీటర్లు. అంచనా వ్యయం 35వేల కోట్లు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను ఇది కలుపుతూ వెళుతుంది. 2028 నాటికి ఇది పూర్తి కావచ్చని భావిస్తున్నారు.
ఓడ రేవుల కనెక్టీవిటీకి ఊపు..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు వరకూ అభివృద్ధి చేస్తున్న రాయ్‌పూర్–కోరాపుట్– విశాఖ పట్నం ఎక్స్‌ప్రెస్ వే 465 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఖనిజాలు, పారిశ్రామిక ప్రాంతాలను విశాఖ పోర్టుతో అనుసంధానించనున్నది. ఇది 2026 చివరిలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని కూడా ఇది గణనీయంగా తగ్గిస్తుంది.
లూధియానా –భఠిండా కారిడార్
పంజాబ్‌లో నిర్మిస్తున్న లూధియానా– భఠిండా ఎక్స్‌ప్రెస్‌వే 2028 నాటికి పూర్తవుతుందని అంచనా. రాష్ట్రంలోని రెండు ప్రధాన పారిశ్రామిక నగరాల మధ్య సరుకు రవాణాను ఈ ఎక్స్‌ప్రెస్‌వే సులభతరం చేయనున్నది.
ఇవి కూడా చదవండి..
ఆరు లైన్లు…డబుల్ డెక్కర్ తో విజయవాడ – హైదరాబాద్ హైవే : మంత్రి వెంకట్ రెడ్డి
HYD to BNG – NH-44 | రూపుమారిన హైదరాబాద్-బెంగళూరు హైవే – గ్రీన్‌ఫీల్డ్ నుండి యాక్సెస్ కంట్రోల్డ్ : 5 గంటలే ప్రయాణం
12 Lane Greenfield Expressway | ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram