తెలంగాణ రాష్ట్రంలో 15 జాతీయ రహదారుల భారీ విస్తరణ

తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని 15 జాతీయ రహదారులను రూ.33,690 కోట్లతో 1,123 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీ పెంపు, వాణిజ్య రవాణా వేగవంతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశాలు.

తెలంగాణ రాష్ట్రంలో 15 జాతీయ రహదారుల భారీ విస్తరణ
  • 1,123 కిలోమీటర్ల హైవేలు నాలుగు వరుసలుగా విస్తరణ
  • 2028 నాటికి పూర్తి కానున్న 15 హైవే ప్రాజెక్టులు
  • భూసేకరణ, పర్యావరణ అనుమతులలో రాష్ట్ర బాధ్యతలు
  • రహదారుల విస్తరణతో రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు

తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద ప్యాకేజీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా రవాణా మౌలిక సదుపాయాల మెరుగుదలకు నడుం బిగించిన కేంద్రం, తెలంగాణలోని 15 జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.33,690 కోట్ల భారీ బడ్జెట్‌ను మంజూరు చేసింది. ఈ విస్తరణ 1,123 కిలోమీటర్ల మేర ఉండనుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారులు నాలుగు వరుసలుగా మారితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి రవాణా వేగం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2028 నాటికి ఈ విస్తరణ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఇతర రాష్ట్రాలతో కలుపుతూ, దక్షిణ భారత దేశానికి వ్యూహాత్మక అనుసంధానం కల్పించడం ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రధాన ఉద్దేశం. తెలంగాణ మీదుగా అంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే రహదారులను విస్తరించడం ద్వారా వాణిజ్య రవాణా సౌకర్యం పెరుగుతుంది. పర్యాటక రంగం, పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులకు కావలసిన భూసేకరణ, అటవీ అనుమతులు, పర్యావరణ క్లియరెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. ఇప్పటికే రహదారి పక్కన ఉన్న భూములపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఉండటంతో పరిహారం, పునరావాసం వంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భూసేకరణలో వివాదాలు ఎదురయ్యే అవకాశముంది.

NH-167 ప్రధాన ప్రాజెక్ట్

ఈ విస్తరణ ప్రాజెక్టుల్లో అతిపెద్దది NH-167. జడ్చర్ల నుంచి కోదాడ వరకు 219 కిలోమీటర్ల ఈ మార్గం నాలుగు వరుసలుగా మారనుంది. కల్వకుర్తి, మల్లేపల్లి, హాలియా, అలీనగర్, మిర్యాలగూడ మీదుగా ఈ రహదారి సాగుతుంది. ప్రస్తుతం ఈ మార్గం రెండు వరుసలుగా ఉండటంతో వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. నాలుగు వరుసలుగా విస్తరించటం వలన ప్రయాణ సమయం 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ హైవేల విస్తరణతో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఉత్సాహాన్ని పొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రహదారుల అభివృద్ధి ప్రాంతాల్లో భూముల ధరలు 30-40 శాతం పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీతో కొత్త పారిశ్రామిక పార్కులు, గోదాములు, వాణిజ్య సముదాయాలు స్థాపించబడే అవకాశం ఉంది.

ఇతర రహదారి ప్రాజెక్టులు

ఈ ప్రాజెక్టుల్లో బోధన్-నిజామాబాద్ సెక్షన్‌లోని NH-63లో 36 కిలోమీటర్ల విస్తరణ, హైదరాబాద్-భూపాలపట్నం మార్గంలోని NH-163లో 26 కిలోమీటర్ల విస్తరణ, విజయవాడ-జగదల్‌పూర్ మార్గంలోని NH-30లో 100 కిలోమీటర్ల విస్తరణతో పాటు కొత్తగూడెం, పాల్వంచ బైపాస్‌ల అభివృద్ధి జరుగుతుంది. అలాగే మెదక్ సెక్షన్ వరకు ORR నుంచి NH-765Dలో 63 కిలోమీటర్ల విస్తరణ, పరకాల-భూపాలపల్లి బైపాస్‌లోని NH-353Cలో 61 కిలోమీటర్ల విస్తరణ కూడా ఉంటుంది.

భవిష్యత్తు ప్రణాళికలు

దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ట్రాఫిక్ వాల్యూమ్ ఆధారంగా టోల్ రుసుములు నిర్ణయించబడతాయి.