Emerging Cities South India | దక్షిణాదిలోని ఆ ఐదు నగరాలు.. లగ్జరీ నివాసాలకు కొత్త అడ్రస్!
మెట్రో నగరాలు కాకుండా.. పెట్టుబడి కోసం ఇళ్లను ఖరీదు చేయాలనుకునేవారికి దక్షిణ భారత దేశంలో ప్రధానంగా ఐదు ద్వితీయశ్రేణి నగరాలను రియల్ ఎస్టేట్ వర్గాలు ప్రతిపాదిస్తున్నాయి. ఆ నగరాల వివరాలే ఇవి.
Emerging Cities South India | లగ్జరీ నివాసాలు అనేవి ఇప్పటి వరకూ ప్రధాన నగరాల్లోనే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు అవి ద్వితీయ నగరాలకూ వ్యాపిస్తున్నాయి. విస్తరిస్తున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZs), సెమీకండక్టర్, ఈవీల తయారీ హబ్‌లు, కొనసాగుతున్న లాజిస్టిక్ గ్రోత్, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందటం వంటివి ఈ నగరాల అభివృద్ధికి కొత్త బాటలు వేస్తున్నాయి. వీటన్నింటి కారణంగా సంపద అనేది మెట్రో నగరాల నుంచి ద్వితీయ శ్రేణి అర్బన్ కేంద్రాలకు తరలుతున్నది. పెద్ద ఎత్తున కంపెనీలు ఆ యా ద్వితీయ శ్రేణి నగరాలను ఎంచుకోవడంతో అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడంతో సహజంగానే కొత్త ఆర్థిక వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఇక ప్రత్యేకంగా విమానాశ్రయాలు కూడా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పడుతుండటం అభివృద్ధిని వేగవంతం చేస్తున్నది. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ కొత్త పునాదులు వేసుకుని, వేగంగా విస్తరిస్తున్నది. లగ్జరీ నివాసాలు సైతం ఇక్కడ పెరుగుతుండటం గమనార్హం. ఆ నగరాలేంటో చూద్దామా..
మంగళూరు (కర్ణాటక)
మంగళూరు ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దక్షిణాది నగరాల్లో ఒకటిగా నిలుస్తున్నది. విస్తారమైన తీర ప్రాంతం, ఆహ్లాదకరమైన బీచ్‌లు, విద్యా సంస్థలు, పట్టణీకరణ ఇక్కడ కనిస్తాయి. ప్రకృతి అందాలకు, సాంస్కృతిక వారసత్వానికి ఈ నగరం ప్రఖ్యాతి చెందింది. ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్‌పై కేంద్రీకరించిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి, దిగుమతుల ఓడరేవులు, పెరుగుతున్న లాజిస్టిక్, ఐటీ పార్కులు ఇక్కడ కీలక అంశాలుగా ఉన్నాయి. ప్రెస్టీజ్, శోభ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ప్రీమియం ఓషన్ వ్యూ లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను ప్రారంభించాయి. ప్రధాన కంపెనీలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) సర్టిఫికేషన్స్‌ను అడాప్ట్ చేసుకుంటున్నాయి. కద్రి ప్రాంతంలో ప్రీమియం గ్రీన్ సర్టిఫైడ్ అపార్ట్‌మెంట్స్‌కు చదరపు అడుగుకు రూ.6వేల వరకూ పలుకుతున్నది. సమద్రం సమీపంలో రిటైర్మెంట్ హోమ్స్ లేదా వెకేషనల్ ఇళ్ల కోసం స్థానిక కొనుగోలు ద్వారా తక్కువగానే ఆసక్తి చూపుతుంటే.. ఎన్నారైల నుంచి డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ పట్నం
దక్షిణాదిలో వేగంగా రియల్‌ఎస్టేట్ మార్కెట్ విస్తరిన్న నగరాల్లో ఏపీలోని విశాఖ పట్నం ఒకటి. పోర్ట్ సిటీ, ఆహ్లాదకర వాతావరణం, పర్యాటక కేంద్రాలు, ఉన్న విద్యా సంస్థలు ఈ నగరాన్ని అత్యుత్తమ నివాస ప్రాంతాల్లో ఒకటిగా మార్చాయి. ప్రధానంగా విశాఖ పోర్ట్‌తోపాటు ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ స్పెషల్ ఎకనమిక్ జోన్లు, ఎదుగుతున్న ఐటీ రంగం, ఎనర్జీ ప్లాంట్లు ఒక ఎత్తయితే.. గూగుల్ తాజాగా ప్రకటించిన 15 వందల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయనున్న ఏఐ హబ్ ప్రాజెక్ట్ ఈ నగరం దశ దిశలను మార్చి వేయనున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎల్ అండ్ టీ, డీఎస్‌ఆర్ వంటి డెవలపర్లు సముద్ర తీర లగ్జరీ అపార్ట్‌మెంట్లు, టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. మొత్తంగా విశాఖ పట్నం రియల్ ఎస్టేట్ మార్కెట్ రానున్న కొన్ని సంవత్సరాల్లోనే బలమైన వృద్ధి సాధించే దిశగా సాగుతున్నది. గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్‌మెంట్‌లకు అధిక డిమాండ్ ఉన్నది. స్థానిక కొనుగోలుదారులతోపాటు.. ఎన్నారైలు, రెండో ఇంటిని ఖరీదు చేయాలనే కోరిక ఉన్నవారు ఆసక్తి చూపుతున్నారు. విశాఖ పట్నం ఎయిర్‌పోర్ట్ రన్‌వే విస్తరణ, డాటా సెంటర్ హబ్‌లు, కోస్టల్ కారిడార్ వంటి ప్రణాళికలు నగర ‘విలువ’ను మరింత పెంచే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది.
కోయంబత్తూర్ (తమిళనాడు)
విద్య, ఉద్యోగాల కేంద్రంగా ఉంది. పరిశుభ్రమైన గాలి, అలరించే ప్రకృతి అందాలు, మంచి జీవన ప్రమాణాలు ఉన్న ప్రాంతం. ప్రత్యేకించి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కోయంబత్తూర్. ఇక్కడ టెక్స్‌టైల్ క్లస్టర్లు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, రాబోయే కాలంలో రానున్న ఐటీ పార్కులు, మెరుగైన లాజిస్టిక్ వ్యవస్థ కోయంబత్తూర్ బలంగా చెబుతున్నారు. ఇక్కడ ఇప్పటికే ప్రెస్టీజ్, పురవంకర కంపెనీలు లగ్జరీ, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాయి. సగటు అద్దెలు నెలకు 10వేలకు పైగా ఉన్నది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులకు లాభదాయక మార్కెట్‌గా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
కొచ్చి (కేరళ)
కేరళలోని కొచ్చి నగరం వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నది. తీర ప్రాంత జీవన శైలి, ఆరోగ్య సేవలు, విద్యా సంస్థల విషయంలో మంచి గుర్తింపు పొందింది. ఇన్ఫోపార్క్‌లు, ఐటీ పార్కులు, పోర్టు–షిప్పింగ్ లాజిస్టిక్స్ నగరపు వృద్ధి రంగాలుగా ఉన్నాయి. శోభా, అసెట్ హోమ్స్ వంటి సంస్థలు లగ్జరీ వాటర్‌ఫ్రంట్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. ప్రైమ్ ఏరియాల్లో అపార్ట్‌మెంట్ ధరలు ఎస్‌ఎఫ్‌టీకి ఆరు వేల రూపాయలనుంచి 12వేల రూపాయల మధ్య ఉన్నాయి. సముద్ర తీరంలో, మెట్రో రైల్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ధరలు ఇంకాస్త ఎక్కువ ఉన్నాయి. ప్రధానంగా ఎన్నారైలు ఇక్కడ లగ్జరీ నివాసాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెకేషన్ హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎయిర్‌పోర్టును ఆధునీకరించి, మెట్రోను విస్తరించే రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు.
తిరువనంతపురం (కేరళ)
సంప్రదాయ, ఆధునికతల మేలు కలయిక తిరువనంతపురం. ప్రశాంతత, భద్రత కారణంగా ఎక్కువ మంది తిరువనంతపురాన్ని తమ నివాసంగా చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. టెక్నోపార్క్, ఐటీ సెజ్, డిఫెన్స్ ఇండస్ట్రీ, పోర్ట్ కనెక్టివిటీ ఈ నగరపు వృద్ధి కేంద్రాలుగా ఉన్నాయి. అసెట్ హోమ్స్, అలయన్స్ గ్రూప్ వంటి కంపెనీలు ఇప్పటికే బహుళ అంతస్తులతో ఆకాశ హర్మ్యాలు, లగ్జరీ విల్లాలు నిర్మిస్తున్నాయి. ప్రధాన జోన్లలో ఈ ఏడాదిలో ధరల్లో పది నుంచి 12 శాతం మధ్య వృద్ధి ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యగ అవకాశాలు, పెరిగిన మౌలిక సదుపాయాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడ ఎన్నారైలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా విలాసవంతమైన విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ విస్తరణ, మౌలిక సదుపాయాల మెరుగుదలతో రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మెట్రో నగరాల బయట పెట్టుబడి ఉద్దేశంతో ఇళ్లను కొనుగోలు చేసేవారికి, ఎన్నారైలు, స్థిరమైన అద్దె ఆదాయం ఆశించేవారికి, వెకేషన్ హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ ప్లాన్ చేసుకునేవారికి ఇక్కడ పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివరాలు కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. అక్కడి స్థల కాల మాన పరిస్థితులను తెలుసుకుని, అంచనా వేసుకుని, ప్రాపర్టీ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram