Rythu Bharosa Funds : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ !

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా యాసంగి పెండింగ్ నిధులను మార్చిలోనే జమ చేస్తామని మంత్రి వివేక్ వెంకట స్వామి ప్రకటించారు. పంట రుణ పరిమితులు కూడా పెంచారు.

Rythu Bharosa Funds : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ !

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతు భరోసా కోసం ఎదురుచూపులు పడుతున్న తెలంగాణ రైతాంగానికి మంత్రి వివేక్ వెంకట స్వామి తీపి కబురు చెప్పారు. రైతు భరోసా యాసంగి పెండింగ్ డబ్బులను ఇదే మార్చి నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి  వివేక్ వెంకట స్వామి రైతు భరోసా కింద రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. మార్చి నెలలో తొలి విడతగా రూ.4,500కోట్ల వేస్తామని, మిగతా నిధులను ఏప్రిల్ లో  విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రెండు ధఫాలుగా రూ.6వేల చొప్పున రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే డిసెంబర్ నెలలో రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన యాసంగి రైతు బంధు నిధులు సంక్రాంతికి, మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటూ ప్రభుత్వం ధాట వేసింది. తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిన మాట మేరకైనా ఈ నెలలో రైతు భరోసా నిధులు అందుతాయా లేదా అన్నదానిపై రైతుల్లో సందేహాలు వినిపిస్తున్నాయి. మరోవైపు యాసంగి సీజన్ పూర్తవ్వడానికి ఇంకా 18 రోజులే మిగిలుందని, రైతుభరోసా ఎప్పుడేస్తారని తెలంగాణలోని 70 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం విశేషం. అయితే రైతులకు కొంత ఊరటనిచ్చేలా కేంద్రం పీఎం కిసాన్ నిధులను రూ.2వేలు చొప్పున ఈ నెల 13నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుండటం గమనార్హం.

రైతు రుణాల పెంపుతో మరో గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026-27) నుంచి వివిధ రకాల పంట రుణాల పరిమితిని పెంచుతూ రాష్ట్రంలోని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో దీనిపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పంట రుణ పరిమితి పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో 127 రకాల పంటల రుణ పరిమితి పెరుగునుంది. అందులో ప్రధానంగా వరి పంటకు ఎకరానికి రుణ పరిమితి రూ.48వేలుగా నిర్ణయించారు. పత్తికి ఎకరానికి రూ.52వేలు, మొక్కజొన్నకు ఎకరానికి రూ.38వేలు, వేరు శనగకు రూ.34వేలు, మిర్చి పంటకు ఎకరానికి రూ.90వేలు, చెరకు పంటకు రూ.84వేలు రుణ పరిమితి పెంచారు.

రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన వన, పశు వైద్య విద్యాలయాలు, నాబార్డు, బ్యాంకుల అధికారులతో ఏర్పాటైన సాంకేతిక కమిటీ సమావేశంలో 127రకాల పంటల వ్యయాలు, రైతుల ఆర్థిక స్థితిగతులును పరిశీలించి రుణ పరిమితి పెంపుకు సిఫారసులు చేయగా..ప్రభుత్వం ఆమోదించింది.

ఇవి కూడా చదవండి :

Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15నుంచి ఒంటి పూట బడులు
LPG Gas Shortage | గ్యాస్ కొరతతో కరెంటు పొయ్యిల ధరలకు రెక్కలు!