Telangana Debt | రాష్ట్రాన్ని వదలని ‘కేసీఆర్ అప్పుల కుంపటి’ సెగ… రేవంతుదీ అదే బాట

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అప్పుల విషయంలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. గతంలో భారీగా అప్పులు చేశారని విమర్శలు ఎదుర్కొన్న బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సర్కారు కూడా అదే బాటలో నడుస్తున్నదనే అభిప్రాయాలను ఆర్థిక విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Telangana Debt | రాష్ట్రాన్ని వదలని ‘కేసీఆర్ అప్పుల కుంపటి’ సెగ… రేవంతుదీ  అదే బాట
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదీ అదే తీరు
  • స్వంత రాబడి కంటే అప్పులపైనే మక్కువ
  • కేసీఆర్ బూచి చూపి నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌ సీఎం
  • కట్టే అప్పుల కంటే తెచ్చే అప్పులే ఎక్కువ

హైదరాబాద్, విధాత :

Telangana Debt | రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అప్పుల విషయంలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. గతంలో భారీగా అప్పులు చేశారని విమర్శలు ఎదుర్కొన్న బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సర్కారు కూడా అదే బాటలో నడుస్తున్నదనే అభిప్రాయాలను ఆర్థిక విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ తన తొమ్మిదిన్నరేళ్ల పాలనా కాలంలో బడ్జెట్, బడ్జేటేతర అప్పులు కలిపి రూ.4.7లక్షల కోట్ల రుణాలు తెస్తే.. రేవంత్ రెడ్డి ఏడాదిన్నర కాలంలోనే రూ. 1.66 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ లెక్కను పరిశీలిస్తే ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టే బడ్జెట్ పత్రాలలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చెల్లింపుల విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ కాస్తంత బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కేసీఆర్ తన హయాంలో రూ.65 నుంచి 70 వేల కోట్ల మధ్య అసలు, వడ్డీ కింద రూ.1.15 లక్షల కోట్లు చెల్లించగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ నుంచి 2025 మార్చి వరకు రూ.28 వేల కోట్ల అసలు, వడ్డీ కింద రూ.48 వేల కోట్లు చెల్లించారని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి.

ఉమ్మడి రాష్ట్ర వారసత్వ అప్పు 69వేల కోట్లే

నిజానికి కేసీఆర్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చింది రూ.69,603 కోట్లు మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ అప్పు రూ.3.50 లక్షల కోట్లు. ఈ అప్పు ప్రస్తుతానికి రూ. 5 లక్షల కోట్లు దాటే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి బడ్జేటేతర అప్పులు అదనం.

ఏటేటా పెరుగుతున్న వడ్డీల భారం

రాష్ట్ర ఖజానాపై వడ్డీల భారం ప్రతి ఏటా పెరుగుతున్నది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ.5,227 కోట్ల వడ్డీ చెల్లిస్తే 2023 నాటికి రూ.21 వేల కోట్లకు చేరింది. తాజాగా ఈ చెల్లింపులు రూ.25 వేల కోట్లు దాటాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపుల కింద జనవరి 31వ తేదీ నాటికి రూ.24,085.22 కోట్లు చేశారు. ఫిబ్రవరి, మార్చి లెక్కల్లో మరో 5 వేల కోట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు ప్రతి నెల సమర్పించే లెక్కలను పరిశీలిస్తే అర్థం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి అప్పులు చేయడంలో వడ్డీ భారం పెరగడమే కానీ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

వడ్డీ భారం తగ్గించుకోవడానికి రూ.87 వేల కోట్ల రుణాల రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ సర్కారు కోరితే 24 వేల కోట్లకు మాత్రమే అనుమతి లభించింది. ఇప్పటి వరకు రేవంత్ సర్కారు 10.9 శాతం వడ్డీతో తీసుకున్న రూ. 30,536 కోట్లను రూ.7.5 శాతం వడ్డీకి తీసుకు వచ్చి తీర్చారు. దీంతో ప్రతి ఏడాదికి రూ.1,068.76 కోట్ల వడ్డీ భారం రాష్ట్ర సర్కారుపై తగ్గింది. ఇది గుడ్డిలో మెల్ల అన్న తీరుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సొంత ఆదాయ వనరులేవి?

రేవంత్ సర్కారు సొంత ఆదాయ వనరుల పెంపు కోసం కష్టపడకుండా అప్పులపైనే ఆధార పడుతున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెచ్చిన అప్పుల్లో అభివృద్ధి కార్యక్రమాల కంటే సంక్షేమానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

2025–26 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద రూ.19,369.02 కోట్లు, వివిధ రుణాలు (లోన్లు, అడ్వాన్స్‌లు, పేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెబిట్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, కేంద్ర ప్రభుత్వ రుణాలు, ఇతర రుణాలు) కలిపి రూ.41,378.26 కోట్లు అసలు చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ 2026 జనవరి నెలాఖరు వరకు కాగ్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం చెల్లించిన అసలు మాత్రం రూ.14,244.40 కోట్లుగా ఉన్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయా? అన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి.

కట్టే అప్పుల కంటే తెచ్చే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రూ.4.7 లక్షల కోట్ల అప్పు చేసింది. తీర్చింది మాత్రం రూ.70 వేల కోట్లే. రేవంత్ ప్రభుత్వం రూ.1.66 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇందులో తీర్చింది కేవలం రూ. 48 వేల కోట్లే. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 69 వేల కోట్ల రుణం తీసుకున్న రేవంత్ సర్కారు తీర్చిన అప్పు కేవలం రూ. 15 వేల కోట్ల లోపు మాత్రమే ఉండడం గమనార్హం.

స్వంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాల అన్వేషణ కంటే గత ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపి కాలం గడిపే పరిస్థితే రేవంత్ సర్కారు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. కేసీఆర్ సరిగ్గా పాలించలేదనే కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ఆదాయాన్ని పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తామంటేనే ఓట్లేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రూ.1.66 లక్షల కోట్ల రుణాలు తీసుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ల్యాండ్ మార్క్‌గా చెప్పుకొనే కొత్త ప్రాజెక్ట్ ఏమి కనిపించడం లేదని అంటున్నారు. మరో వైపు స్వంత ఆదాయం తీసుకు వచ్చే మార్గాల అన్వేషణ కూడా లేదన్న విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి.

Read Also |

WhatsApp : వాట్సాప్ సంచలన అప్డేట్!..పేరెంట్‌-మేనేజ్డ్‌ మోడల్‌!!
Monalisa | మోనాలిసా వివాహంపై అనేక ప్ర‌చారాలు.. “ఇది లవ్ జిహాద్ కాదు” అంటూ క్లారిటీ
Osmania University | ఉస్మానియా యూనివ‌ర్సిటీలో మ‌ళ్లీ క‌ట్టెల పొయ్యిలు..! పూరీ, వ‌డ‌, రోటీ బంద్..!!