Bike Taxi | మహారాష్ట్రలో ఉబెర్, రాపిడో, ఓలా బైక్ సర్వీసులపై నిషేధం.. తెలంగాణలో?
మహారాష్ట్రలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీసులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. నిబంధనలు పాటించని కారణంగా వాటి అనుమతులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
Bike Taxi |ఓలా, ఉబెర్, రాపిడో బైక్ సర్వీసులపై మహారాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో వీటి టూ వీలర్ సర్వీసులను నిషేధించింది. ఈ మూడు సంస్థలకు మంజూరు చేసిన తాత్కాలిక లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ విధాన సభలో ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఒక నెల రోజుల పాటు అనుమతించామని, ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు సమర్పించడంలో సదరు సంస్థలు విఫలమయ్యాయని ఆయన వివరించారు.
స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ–బైక్ టాక్సీ రూల్స్-2024ను తీసుకువచ్చిందని ప్రతాప్ సర్నాయక్ విధాన సభలో తెలిపారు. తక్కువ డబ్బులతో ప్రతి ఒక్కరు కోరుకున్న గమ్యస్థానానికి ప్రయాణించేలా ఈ సదుపాయం తీసుకువచ్చామన్నారు. ఒక లక్షకు మించి జనాభా ఉన్న పట్టణాల్లో ఈ బైక్ సర్వీసులు ప్రారంభించుకునేలా మంత్రి మండలిలో ఆమోదం కూడా తెలిపామన్నారు. ఈ నిబంధన ప్రకారం ఓలా, ఉబెర్, రాపిడో సంస్థలు ఈ–బైకులను నడుపుతున్నట్లు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉందన్నారు. తాత్కాలిక అనుమతులు మంజూరు చేసిన నెల రోజుల్లో ఈ ప్రక్రియను సదరు సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మూడు సంస్థల్లో ఏ ఒక్కటి కూడా డాక్యుమెంట్లను రవాణ శాఖ కార్యాలయాల్లో సమర్పించకపోవడంతో తాత్కాలిక అనుమతులు వెనక్కి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
నెల దాటినా స్పందనలేదు
నెల రోజులు దాటినా ఏలాంటి స్పందన లేకపోవడంతో టూ వీలర్ సర్వీసులను రద్దు చేశామని మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. ముంబై మహా నగరంలోనే వేల కొద్దీ టూ వీలర్లు తిరుగుతున్నాయని, వీటికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా టూ వీలర్ టాక్సీలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా రవాణా అధికారులను ఆదేశించామని, ప్రత్యేక డ్రైవ్ లు కొనసాగుతున్నాయన్నారు. టూ వీలర్ యజమాని తో పాటు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని, రైడర్ (వెనకాల కూర్చున్నవారు) పై నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రయోగాత్మకంగా అనుమతించడం మూలంగా పలు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. మహిళలు తమకు రక్షణ లేదని తెలియచేశారని, ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులొచ్చాయన్నారు. ఇప్పటి వరకు 130 టూ వీలర్లపై కేసులు నమోదు చేసి రూ.33 లక్షలు పెనాల్టీలు వసూలు చేశామన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి…
ప్రైవేటు లేదా నాన్ ట్రాన్స్ పోర్టు కేటగిరీలోని రైడర్ లేదా ప్రజలను తీసుకువెళ్లకుండా 2023లో నిషేధం విధించామని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ పలువురు నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నారన్నారు. ఈ పరిణామాలను గమనించి గాలి కాలుష్యం నిరోధించేందుకు వీలుగా ఈ–బైక్ విధానాన్ని 2024 లో తీసుకువచ్చామన్నారు. తొలుత 1.5 కిలోమీటర్లు ప్రయాణించే వారికి రూ.15 వసూలు చేసేలా, ఆ తరువాత ప్రతి కిలోమీటర్ కు ఎంత ఛార్జి చేయాలనే దానిపై నిబంధనల్లో పొందుపర్చామన్నారు. ఈ ఏడాది మార్చి 9వ తేదీ నుంచి మహారాష్ట్రలో కొత్త ఆటో రిక్షాల పర్మిట్లను కూడా నిలిపివేయడం జరిగిందన్నారు. కొత్తగా ఆటోలను అనుమతించడం మూలంగా ముంబై, పూణే వంటి నగరాల్లో ట్రాఫిక్ రద్ధీ పెరుగుతున్నదని అన్నారు. ఇదే కాకుండా ప్రస్తుత ఆటోరిక్షా యజమానుల ఉపాధికి నష్టం కలిగించకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు.
తెలంగాణలో ఎప్పుడు నిలిపివేస్తారు?
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఓలా, ఉబెర్, రాపిడో సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా టూ వీలర్ సర్వీసులను నడిపిస్తున్నాయి. ఈ–బైక్‌లు కాకుండా పెట్రోల్‌తో నడిచే వాటికి అనుమతించడం మూలంగా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. స్విగ్గీ, జోమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా పెట్రోల్ తో నడిచే టూ వీలర్లను ఉపయోగిస్తున్నాయి. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ పెరగడంతో పాటు కాలుష్యం అధికమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో మాదిరి హైదరాబాద్ నగరంలో కూడా తొలి 1.5 కిలోమీటర్ల దూరానికి రూ.15 చార్జ్ వసూలు చేయాలని పలువురు రైడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ–బైక్ ఉన్నవారికే పర్మిట్ మంజూరు చేయాలని, పెట్రోల్ నడిచే వాటిని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram