IndiGo Crisis | విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర వైమానిక శాఖ రంగంలోకి దిగింది. టికెట్‌ రేట్లపై సీలింగ్‌ విధించింది.

  • By: TAAZ |    national |    Published on : Dec 06, 2025 6:34 PM IST
IndiGo Crisis | విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం

IndiGo Crisis | గత వారం రోజులుగా దేశీయ విమానయాన రంగంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం కారణంగా వేలాది విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో కేంద్ర విమానయాన శాఖ అప్రమత్తమైంది. న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు శుక్రవారం రాత్రి రూ.1.02 లక్షల చొప్పున ఎయిర్ ఇండియా వసూలు చేసింది. ఇదే రూట్ లో ఆకాశ ఎయిర్ రూ.39వేలకు విక్రయించింది. ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ నుంచి ముంబైకి రూ.60వేలు, చెన్నై నుంచి న్యూఢిల్లీకి రూ.41వేలు, స్పైస్ జెట్ రూ.69వేల చొప్పున టిక్కెట్లను విక్రయించాయి. ఇండిగో విమానాలు రద్ధు కావడంతో మిగతా విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో కేంద్ర విమానయాన శాఖకు మెలుకువ వచ్చింది. ఠారెత్తిస్తున్న టిక్కెట్ రేట్లను నియంత్రించేందుకు రంగంలోకి దిగి దిద్ధుబాటు చర్యలు చేపట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సొమ్ము చేసుకోవడం సరికాదంటూ హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. టికెట్ రేట్లపై సీలింగ్ విధిస్తున్నామని, అమలు చేయాల్సిందేనంటూ ప్రైవేటు విమానయాన సంస్థలకు నోటీసులు పంపించింది.

విమాన ప్రయాణీకుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ రేట్లను నియంత్రణలో పెట్టాలని, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పాటించాలని సూచించింది. ఇది తాత్కాలిక నిర్ణయమని, తదుపరి పరిస్థితిని సమీక్షించి శాశ్వత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా టికెట్ రేట్లను నియంత్రించేందుకు ఐదు వందల కిలోమీటర్ల వరకు రూ.7,500, ఒక వేయి కిలోమీటర్ల వరకు రూ.12వేల వరకు, 1,500 కిలోమీటర్ల వరకురూ.15వేలు, 1,500 కిలోమీటర్లు దాటితే రూ.18వేలు వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇంతకు మించి ఆన్ లైన్ లో కాని, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు విమానయాన సంస్థలకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. అయితే యూడీఎఫ్, పీఎస్ఎఫ్ ఛార్జీలను మినహాయించారు. దేశంలో కరోనా కు ముందు విమాన టికెట్లపై సీలింగ్ ఎత్తివేశారు. అప్పటి నుంచి టికెట్ల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభంతో అమాంతం పెరిగిపోయి ప్రయాణీకులను ఠారెత్తిస్తున్నాయి.