Leopard | అత్త గ‌దిలోకి తొంగిచూడ‌గా.. ఉలిక్కిప‌డ్డ కోడ‌లు పిల్ల‌

Leopard | అప్పుడ‌ప్పుడే తెల్లారుతుంది.. నిద్ర నుంచి మేల్కొన్న కోడ‌లు పిల్ల‌.. అత్త గ‌దిలోకి తొంగి చూసింది. ఇంకేముంది.. కోడ‌లు పిల్ల ఉలిక్కిప‌డింది.

  • By: raj |    national |    Published on : Apr 18, 2026 8:45 AM IST
Leopard | అత్త గ‌దిలోకి తొంగిచూడ‌గా.. ఉలిక్కిప‌డ్డ కోడ‌లు పిల్ల‌

Leopard | అప్పుడ‌ప్పుడే తెల్లారుతుంది.. నిద్ర నుంచి మేల్కొన్న కోడ‌లు పిల్ల‌.. అత్త గ‌దిలోకి తొంగి చూసింది. ఇంకేముంది.. కోడ‌లు పిల్ల ఉలిక్కిప‌డింది. ఎందుకో తెలుసా.. అత్త మంచ‌పై గాఢ నిద్ర‌లో ఉంటే.. కిందేమో చిరుత‌ పులి సేద తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన కోడలు ఉలిక్కిపాటుకు గురైంది. చివ‌ర‌కు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి.. అత్త ప్రాణాల‌ను కాపాడింది కోడ‌లు పిల్ల‌.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క మైసూరులోని సిద్ధార్థ్ లే అవుట్‌లో సురేశ్ అనే వ్య‌క్తి త‌న త‌ల్లి, భార్య‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. త‌ల్లి శైల‌జ త‌న గదిలో నిద్రిస్తోంది. అయితే కోడలు సుజాత‌.. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున నిద్ర నుంచి మేల్కొని అత్త గ‌దిలోకి తొంగి చూసింది. అత్త నిద్రిస్తున్న మంచం కింద చిరుత‌ను చూసి ఉలిక్కిప‌డింది.

ఇక త‌న భ‌ర్త సురేశ్‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఇద్ద‌రూ క‌లిసి శైల‌జ‌ను జాగ్ర‌త్త‌గా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అనంత‌రం గ‌దికి గ‌డియ పెట్టేశారు. అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించ‌గా, వారు కూడా వ‌చ్చేశారు. మొత్తానికి చిరుత‌కు మ‌త్తు మందు ఇచ్చి బంధించారు. అనంత‌రం దాన్ని అట‌వీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిరుత వ‌య‌సు మూడేండ్లు ఉంటుంద‌ని తెలిపారు. సిద్ధార్థ్ లేఅవుట్‌కు స‌మీపంలోని చాముండి అడ‌వుల్లో నుంచి వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.