సీజేఐ ముందు మందు బాటిళ్లు.. చివరకు ఎవరు తీసుకెళ్లారు?

రెండు లిక్కర్ కంపనీల ట్రేడ్ మార్క్‌ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ముందు రెండు విస్కీ బాటిల్స్

సీజేఐ ముందు మందు బాటిళ్లు.. చివరకు ఎవరు తీసుకెళ్లారు?
  • లిక్కర్ కంపనీల కేసు విచారణలో ఘటన

విధాత : రెండు లిక్కర్ కంపనీల ట్రేడ్ మార్క్‌ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ముందు రెండు విస్కీ బాటిల్స్ ఉంచి వాదోపవాదాలు వినిపించిన ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. అయితే తమ కంపెనీ ‘బ్లెండర్స్ ప్రైడ్’ ట్రేడ్‌మార్క్ ‘ఇంపీరియల్ బ్లూ’ బాటిల్ రూపాన్ని జేకే ఎంటర్‌ప్రైజెస్‌ ఉల్లంఘించిందని మరో మద్యం తయారీ కంపెనీ పెర్నోడ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జేకే ఎంటర్‌ప్రైజెస్‌పై తాత్కాలికంగా నిషేధం విధించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా, మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలపై పెర్నోడ్ కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై శుక్రవారం విచారణ జరిపింది.


రెండు ఉత్పత్తులను కోర్టులోకి తీసుకురావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ, ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అనంతరం రెండు మద్యం బాటిళ్లను తన టేబుల్‌పై ఉంచి వాదనలు వినిపించారు. తన ముందు పెట్టిన మందు బాటిల్స్‌ను చూసిన సీజేఐ చంద్రచూడ్ గట్టిగా నవ్వేసి ఈ బాటిల్స్ మీరు తెచ్చారా? అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీని ప్రశ్నించారు. అవునని బదులిచ్చిన ఆయన రెండు ఉత్పత్తుల మధ్య సారూప్యతను చూపించడానికి వాటిని తెచ్చినట్లు చెప్పారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన ఎలా జరిగిందన్నది ఆయన వివరించారు. దీంతో గతంలో ఇలాంటి తరహా కేసు విచారణను సీజేఐ గుర్తు చేశారు. వాదోపవాదల అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అనంతరం ఈ బాటిల్స్‌ తీసుకెళ్లతారా? అని సీజేఐ చంద్రచూడ్‌ను సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ సరదాగా అడిగారు. దీనికి ఆయన నవ్వుతూ ‘ఎస్‌ ప్లీజ్‌’ అని అనడటం కొసమెరుపు.