Ajith Pawar : మహిళా ఐపీఎస్ కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫోన్ ..వైరల్ గా వీడియో
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్-మహిళా ఐపీఎస్ అంజనా కృష్ణ మధ్య ఫోన్ సంభాషణ వీడియో వైరల్, నెటిజన్లు ఐపీఎస్‌ను ప్రశంసిస్తున్నారు.

విధాత : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajith Pawar) ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ(Anjana Krishna) మధ్య జరిగిన వాగ్వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్డు నిర్మాణం పేరుతో కర్మలా తాలుకా కుద్దు గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన ఐపీఎస్ అంజనా కృష్ణ గ్రామానికి విచారణకు వెళ్లారు. అక్కడే ఉన్న గ్రామస్తులు, ఎన్సీపీ కార్యకర్తలు అధికారులతో గొడవకు దిగారు. ఓ ఎన్సీపీ కార్యకర్త డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఫోన్ చేసి అంజనా కృష్ణకు ఇచ్చారు.
నేను డిప్యూటీ సీఎంను మాట్లాడుతున్నానని..ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా మీ చర్యలు ఆపాలంటూ పవార్ ఆమెను ఆదేశించారు. మీరు చెబుతున్నది నాకు అర్థమవుతుందని..కాని ఫోన్ లో నేను మాట్లాడుతుంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా ? కాదా? తెలుసుకునేందుకు నా ఫోన్ నంబర్‌కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా? అని అంజనా కృష్ణ(Anjana Krishna) కోరారు. దీంతో ఆగ్రహించిన అజిత్ పవార్(Ajith Pawar) నీకు ఎంత ధైర్యం..నన్నే వీడియో కాల్ చేయమంటావా? నన్ను చూడాలనుకుంటున్నారుగా మీరే నాకు వీడియో కాల్ చేయండి..నేను మీపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు.
వారి మధ్య సాగిన ఈ సంభాషణను అక్కడున్న వారిలో ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మంత్రి తీరును తప్పుబడుతూ ఐపీఎస్ అంజానా కృష్ణను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.